- ఏటా ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత
- తాజాగా సౌత్ గ్లాస్ పరిశ్రమలో ఐదుగురు మృతి
- భద్రతను పట్టించుకోని యాజమాన్యాలు
- ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాల హడావుడి
- అమలుకు నోచుకోని కార్మిక చట్టాలు..
- రూల్స్ పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
షాద్ నగర్, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని వలస కార్మికుల బతుకులు గాల్లో దీపంలా మారుతున్నాయి. అనుకోని ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తున్న యాజమాన్యాలు సేఫ్టీని పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గం ఫ్యాక్టరీలు, వివిధ కంపెనీలకు నిలయంగా మారింది. ఇక్కడి కొత్తూరు, కేశంపేట, నందిగామ, ఫరూఖ్ నగర్, కొందుర్గ్, చౌదరిగూడ మండలాల్లో 300కు పైగా కంపెనీలు ఉన్నాయి.
వీటిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం మినీ ఇండియాగా మారిపోయింది. అయితే కంపెనీల యాజమాన్యాలు వలస కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా, వెట్టి చాకిరి చేయిస్తున్నాయి. సేఫ్టీ రూల్స్పాటించకుండా ఫ్యాక్టరీలను నడిపిస్తున్నాయి. డ్యూటీలకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇండ్లకు చేరుతారో.. లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా స్కిల్స్ లేని కార్మికులను పనిలోకి తీసుకుంటుండడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా పరిశ్రమల్లో అన్స్కిల్డ్లేబర్పనిచేస్తున్నారు. పనిపై అవగాహన లేక, ఉన్నవారిపై ఒత్తిడి ఎక్కువై ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ప్రాణ నష్టం పెరిగిపోతుంది. షాద్నగర్పరిధిలో గడిచిన పదేండ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగినా యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. చాలా కంపెనీల్లో ఎమర్జెన్సీ టైంలో కార్మికులను హాస్పిటల్స్ కు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా ఉండడం లేదు. ఇన్‌టైంలో వైద్యం అందక మృతుల సంఖ్య పెరిగిపోతుంది.
వరుస ప్రమాదాలు
షాద్నగర్నియోజకవర్గంలోని వందల పరిశ్రమల్లో రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో కొత్తూరులోని వినాయక స్టీల్పరిశ్రమలో బాయిలర్ పేలి 10 మంది చనిపోయారు. అదే ఏడాది కొత్తూరు రాయలసీమ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. 2015లో షాద్‌నగర్‌లోని టీమ్కోర్ పరిశ్రమలో ఫార్నస్ పేలి 12 మంది మృత్యువాత పడ్డారు. నందిగామ మండలంలోని పలు పరిశ్రమల్లో ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోయారు. గడిచిన ఆరేండ్లలో మొగిలిగిద్ద, ఎలికట్టలోని ఐరన్ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. గతేడాది కాశిరెడ్డిగుడ శివారులోని బ్లైండ్ కలర్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు.
తాజాగా శుక్రవారం బూర్గుల శివారులోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. యాజమాన్యాలకు శ్రమ దోపిడీపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాల పైన లేకుండా పోయిందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవ చారి మండిపడ్డారు. ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని, స్థానక స్కిల్డ్లేబర్ను పనిలోకి తీసుకోవాలని సూచించారు. పనిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలను ఆపొచ్చన్నారు. కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని కోరారు.
సౌత్ గ్లాస్యాజమాన్యంపై ఎమ్మెల్యే ఫైర్
ఫరూక్ నగర్ మండలం బూర్గులలోని సౌత్ గ్లాస్ పరిశ్రమను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం పరిశీలించారు. కార్మికులు, స్థానికులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. కంపెనీ నిర్వహణలోని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, అవే కార్మికులను పొట్టన పెట్టుకున్నాయని మండిపడ్డారు.
సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడం దారుణం అన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో మృతుల కుటుంబ సభ్యులను ఆమె కలిశారు. కంపెనీ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సౌత్ గ్లాస్ పరిశ్రమను పరిశీలించారు. గాయపడ్డ కార్మికులను పరామర్శించారు.