భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురి హత్య

  • కర్నాటకలో దోషికి ఉరిశిక్ష ఖరారు

బెంగళూరు : భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్షే సరైనదని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధార్వాడ్ బెంచ్ ఖరారు చేసింది. కర్నాటకలోని బళ్లారి జిల్లా కాంచనగడ్డ గ్రామానికి చెందిన బైలూరు తిప్పయ్యకు 12 ఏండ్ల క్రితం ఫకీరమ్మతో పెండ్లి జరిగింది. కొంత కాలం తర్వాత తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగాయి. వారికి నలుగురు పిల్లలు ఉండగా, వారిలో ఒక్కరు మాత్రమే తనకు పుట్టారని, మిగతా ముగ్గురు తన పిల్లలు కారని గొడవపడేవాడు. ఆ అనుమానంతోనే 2017, ఫిబ్రవరి 25న ఫకీరమ్మపై తిప్పయ్య కత్తితో దాడి చేశాడు.

పదేండ్ల లోపు వయసున్న ముగ్గురు పిల్లలను సైతం కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన తన వదిన గంగమ్మ పై కూడా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం, కత్తి పట్టుకుని వీధిలో తిరిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తిప్పయ్యను అరెస్ట్​ చేశారు. ఈ కేసును బళ్లారి ట్రయల్ కోర్టు విచారించి.. నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా, నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు .. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. నిందితుడి క్రూరత్వానికి తాము  దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొంది. ఇది ఉరిశిక్షకు అర్హమైన అత్యంత అరుదైన నేరంగా నిర్ధారించింది. అతడు హత్యలు  చేసిన తీరును చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందని జస్టిస్​ సూరజ్ గోవిందరాజ్, జస్టిస్ జి. బసవరాజా బెంచ్​ వ్యాఖ్యానించింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారికి పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.