భద్రాద్రి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

భద్రాద్రి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

పాల్వంచ/భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. పాల్వంచలోని ఇందిరా కాలనీ సెంటర్​లో భద్రాచలం హైవేపై మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. బూర్గంపాడు మండలం బుడ్డగూడెంకు చెందిన సోడే సారయ్య(28), సోడే నరేశ్(32) బైక్​పై పాల్వంచ నుంచి తిరిగి గ్రామానికి వెళ్తుండగా.. ఇందిరా సెంటర్​లో డివైడర్​ను ఢీకొట్టడంతో నరేశ్​ అక్కడికక్కడే చనిపోయాడు.

సారయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. సారయ్య జేసీబీ ఆపరేటర్ గా పని చేస్తుండగా నరేశ్​ ట్రాక్టర్  డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక ఈ ప్రమాదం జరిగిన 100 మీటర్ల పరిధిలోనే మణుగూరు నుంచి హైదరాబాద్  వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న లక్ష్మీదేవిపల్లికి చెందిన నాగరాజు(50)ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఇసుక లారీ ఢీకొని ఇద్దరు టెన్త్  విద్యార్థులు..

ఇసుక లారీ ఢీకొని ఇద్దరు టెన్త్  విద్యార్థులు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని రాహుల్​ విజ్ఞాన్​ స్కూల్​లో టెన్త్  చదువుతున్న జీపీపల్లికి చెందిన ఎంబడి మురళీకృష్ణ(15), విజయకాలనీకి చెందిన చింతలపూడి రేవంత్ రాజ్(15), లింగాపురానికి చెందిన యాకూబ్​ పాషా ఇదే మండలంలోని ఎదిర గుట్ట గ్రామం నుంచి బైక్​పై వస్తున్నారు.

అదే సమయంలో చర్ల వైపు నుంచి ఇసుక లోడ్​తో వస్తున్న లారీ సుబ్బంపేట శివార్​లో వీరి బైక్​ను ఢీకొట్టింది. ఎదురుగా వెళ్తున్న మరో బైక్​ను ఓవర్​ టేక్​ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో ఎంబడి మురళీకృష్ణ, చింతలపూడి రేవంత్​రాజ్​ అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన యాకూబ్​ పాషాను చర్ల ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజువర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్​బాడీలను ఆసుపత్రికి తరలించారు.