- 10 మందికి గాయాలు.. గాజాలో విషాదం
జెరూసలెం: గాజాలో మరో ఘోరం జరిగింది. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై విమానాల నుంచి జారవిడిచిన ఆహార ప్యాకెట్ల తోకూడిన ప్యారాచూట్ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో వాటికి కట్టిన పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్న పార్సిళ్లు వేగంగా కింద ఉన్న జనంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా పౌరులు కొన్ని రోజులుగా ఆకలి బాధను అనుభవిస్తున్నారని ఏఎఫ్ పీ మీడియా సంస్థ వెల్లడించింది.
వారిని ఆదుకునేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చి ఎయిర్‌డ్రాప్‌ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయని తెలిపింది. వీటిలో అమెరికా, జోర్డాన్, బెల్జియం, ఈజిప్ట్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయని చెప్పింది. అయితే, శుక్రవారం ఉత్తర గాజాలోని ఒక శిబిరం వద్ద ఆహారప్యాకెట్ల కోసం ఎదురుచూస్తున్న పౌరులపై ప్యారాచూట్ కూలిందని వివరించింది. ఆహార ప్యాకెట్లతో కూడిన ప్యారాచూట్ కిందకు దిగే సమయంలో తెరుచుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. దీంతో ఐదుగురు మృతి చెందగా..గాయపడిన మరో 10మందిని ఆల్-షిఫా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎఫ్ పీ వెల్లడించింది.
ఘటనపై ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది. మానవతా సాయం చేసేందుకు ల్యాండ్ డెలివరీలకు ఎయిర్‌డ్రాప్‌లు ప్రత్యామ్నాయం కాదని తెలిపింది. సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా గాజా చేరుకోవడానికి మరిన్ని ట్రక్కులను అనుమతించాలని ఇజ్రాయెల్ ను కోరింది. అయితే, ఇటీవల ఆహారం కోసం ట్రక్కుల వద్దకు వేలాది మంది పరుగెత్తుకుంటూ వెళ్లడంతో, అక్కడే తమ యుద్ధ ట్యాంకులు ఉండటంతో ఇజ్రాయెల్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.