ప్రారంభించిన మంత్రి పువ్వాడ
త్వరలో మరో 6 సర్వీసుల ఆన్ లైన్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్ లైన్ లో పొందేలా కొత్తగా మరో 5 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇంట్లోనుంచే కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా వాహన్ వెబ్‌సైట్‌లో కావలసిన సేవల కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్ పోర్ట్ భవన్‌లో ఇంటి నుంచే పొందే 5 రకాల సేవలను మంత్రి ప్రారంభించారు. డూప్లికేట్ ఎల్‌ఎల్‌ఆర్ (లెర్నర్ లైసెన్స్), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీఏలో 59 ఆన్‌లైన్ సేవలు ఉన్నాయి. ఇందులో అప్లికెంట్లు నేరుగా హాజరు కావాల్సిన సర్వీసులు 31 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 5 సేవలను పూర్తిగా ఆన్ లైన్ చేశారు. మరో 6 సర్వీసులను వారం, పది రోజుల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సర్వీసులతో ఆర్టీఏ ఆఫీసుల్లో పనుల కోసం ఏజంట్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, కమిషనర్ ఎంఆర్‌ఎం రావు, జేటీసీ పాండురంగా నాయక్ పాల్గొన్నారు.
For More News..