ఈ ఏడాది డిసెంబర్ తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం 5 -రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత, మిగిలిన ఈ 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ -రాష్ట్రాల్లో బీజేపీ రాణించకపోతే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అలాగే 2018లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో మెజార్టీ చోట్ల విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్తప్పక గెలవని పరిస్థితి నెలకొంది. లేదంటే కర్నాటకలో గెలిచిన వైభవాన్ని ఆ పార్టీ కోల్పోయే ప్రమాదం ఉంది. 2018లో తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఈ అయిదు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ బీజేపీ గెలవలేదు.
చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లను కాంగ్రెస్, తెలంగాణను కేసీఆర్ గెలుచుకున్నారు. మిజో నేషనల్ఫ్రంట్మిజోరంలో అధికారం సాధించింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా అవతరించింది. 2018 డిసెంబర్‌లో చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ, ఈ 3 రాష్ట్రాల్లోని 65 ఎంపీలలో 63 మందిని కోల్పోయింది. మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా, 82 ఎంపీలకుగానూ 67 ఎంపీలను గెలుచుకుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్ ముందుగా తెలంగాణలో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలి. లేదంటే ఆయన పార్టీ మనుగడ కష్టమే.
రాష్ట్రాల వారీగా చూస్తే..
రాజస్థాన్ : 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక్కడ 3 సార్లు సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్, సచిన్ పైలట్ అని రెండు వర్గాలుగా చీలిపోయింది. పైగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. బీజేపీ విషయానికొస్తే1967 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉన్నది. రాజస్థాన్‌లో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా, కాంగ్రెస్ సామర్థ్యాన్నీ కొట్టిపారేయలేం. ఒక రకంగా రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి.
చత్తీస్‌గఢ్ : చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కే ఎక్కువ స్కోప్ఉన్నది. అయితే ఈ రాష్ట్రంలో సీబీఐ పలువురు నేతలపై అవినీతి కేసులు పెట్టింది. ఆ కథ ఇప్పుడే మొదలైంది. చివరకు ఏం తేలుతుందో చూడాలి.
మధ్యప్రదేశ్ : 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచింది, కానీ మెజారిటీని కోల్పోయింది. దాంతో బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్‌కు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పోరు హోరాహోరీ ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే శివరాజ్ చౌహాన్ మాత్రం బీజేపీకి బలమైన ప్రాంతీయ నాయకుడు. బీజేపీకి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ : లిక్కర్ స్కాం బయటపడినప్పటి నుంచి కేసీఆర్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో శాంతియుతంగానే నడుచుకుంటున్నది. ఆ పార్టీకి కోపం రాకుండా ఉండేందుకే కేసీఆర్ కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలుస్తోంది. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో కేసీఆర్ తలపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఉందనడంలో సందేహం లేదు. కానీ ప్రతిపక్షాలు ఇక్కడ రెండుగా చీలిపోయాయి. పైగా గతంలో లేని విధంగా ఈసారి బరిలోకి దిగుతున్న పార్టీల సంఖ్య పెరిగింది. బీజేపీ విషయానికొస్తే గత 2018 ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ కచ్చితంగా మెరుగుపరుస్తుంది. కాంగ్రెస్ ఎంత పెరిగితే కేసీఆర్‌కు అంత నష్టం వాటిల్లుతుంది. ఈసారి తెలంగాణలో ముక్కోణపు టఫ్ఫైట్ఉండబోతున్నది.
మిజోరం : 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో మిజో నేషనల్‌ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎంఎన్ఎఫ్కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది. 2008 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 38 శాతం ఓట్లను గెలుచుకుంది. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కేసీఆర్ కనీస అవసరం
మరో నాలుగు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు మంచి మెజారిటీ రావాలి. కేసీఆర్ మెజారిటీ కోల్పోయినా లేదా సాధారణ మెజార్టీతో సరిపెట్టుకున్నా, ఆయనకు పాలనలో చిక్కులు తప్పవు. రెండు జాతీయ పార్టీల్లో ఏది కేసీఆర్‌ను గద్దె దించినా, ఆయన పార్టీ క్షీణించడం మొదలవుతుంది. అదే ఇప్పుడు భారతదేశంలోని ఉక్కు రాజకీయ చట్టాలు. బీజేపీ, కాంగ్రెస్‌లకు 60 మంది ఎమ్మెల్యేలు వస్తే.. అది కేసీఆర్‌కి ఓటమి కిందే లెక్క. అందుకే కేసీఆర్రెండు జాతీయ పార్టీల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ భవితవ్యం
2018లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను గెలుచుకుంది. మొన్నటి కర్నాటక విజయం తర్వాత ఈ ఏడాది డిసెంబర్‌లో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 2 లేదా మూడు రాష్ట్రాలను గెలుచుకోవాలి. లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందినట్లుగా పార్లమెంట్ఎన్నికల్లో ప్రజలు భావిస్తారు. తెలంగాణాలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకుంటే పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. కేసీఆర్ పార్టీకి మెజారిటీ రాకుండా కాంగ్రెస్ ఆపాలి. కేసీఆర్‌కు మెజారిటీ వస్తే, కాంగ్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. భారతదేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ గెలిస్తే అక్కడ కాంగ్రెస్ తగ్గిపోతున్నదని అర్థం. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
బీజేపీ పరిస్థితి ఏమిటి?
కర్నాటక ఓటమి తర్వాత బీజేపీకి మిజోరం మినహా 4 రాష్ట్రాలు గొప్ప అవకాశం. 2018లో బీజేపీ మొత్తం 5 రాష్ట్రాల్లో మెజార్టీ సాధించలేదు. డిసెంబర్‌లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైనా 2 రాష్ట్రాల్లో గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతుంది. బీజేపీ సహేతుకమైన విజయం సాధిస్తే, అది గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 2018లో మిజోరం మినహా 4 రాష్ట్రాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం కూడా బీజేపీకి ఇప్పుడు ఒక రకంగా అడ్వాంటేజ్. ప్రస్తుతం ప్రజావ్యతిరేకత ఉన్న ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పై విజయం సాధించడం బీజేపీకి తేలిక. ఇంకా 5 నెలల సమయం ఉంది. వీటిలో ఏ రాజకీయ పార్టీకైనా ఆదరణ పెరగొచ్చు, తగ్గొచ్చు. కర్నాటక మంత్రమే పని చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. కర్నాటక ఓటమిలో బీజేపీ తప్పులు సరిదిద్దుకోవచ్చు. రాజకీయాల్లో 5 నెలలు చాలా పెద్ద సమయమే!.
- డా. పెంటపాటి పుల్లారావు,,
పొలిటికల్ఎనలిస్ట్