నాలుగు రాష్ట్రాల్లో కమలం కమాల్

నాలుగు రాష్ట్రాల్లో కమలం కమాల్

సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారైన ఉత్తర్ ప్రదేశ్లో మెజార్టీ స్థానాలను ఖాతాలో వేసుకున్న కమలదళం వరుసగా రెండోసారి బీజేపీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఎన్డీ తివారీ రికార్డును బద్దలు కొట్టారు. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ ఇతర పార్టీలను ఊడ్చేసింది. ఆప్ జోరుకు సీఎం సహా బడా బడా నేతలే చతికిలపడ్డారు. 8 ఏళ్ల పోరాటం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ సొంతం చేసుకుంది.

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

ఉత్తరాఖండ్లో విజయఢంకా మోగించినప్పటికీ బీజేపీకి అనుకోని షాక్ తలిగింది. ప్రస్తుత సీఎం, బీజేపీ అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,951 ఓట్లతో ఓటమిపాలైయ్యారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి చెందిన సిట్టింగ్ సీఎం ఓడిపోవడం ఆ పార్టీ కర్యకర్తలను నిరాశకు గురి చేసింది. ఇదిలా ఉంటే లాల్ కాన్ స్థానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ సైతం ఓటమి పాలయ్యారు. ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఓడిపోవడం విశేషం. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బీజేపీ వెంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు

మోడీపై ప్రజలకున్న నమ్మకమే గోవాలో తమను గెలిపించిందన్నారు స్టేట్ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్. పూర్తి మెజారిటీ దిశగా తాము దూసుకెళ్తున్నామన్నారు. తమకు ఓటేసిన ప్రజలను ధన్యవాదాలు తెలిపారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, ఎంజీపీ కూడా మద్దతిస్తోందని ఫడ్నవీస్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్తో పాటు, స్టేట్ బీజేపీ చీఫ్ను నేతలు సన్మానించారు.

మనోహర్ పారికర్ తనయుడి ఓటమి

గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌  కొడుకు ఉత్పల్‌ పారికర్‌ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో శ్రమించినా ఫలితం నిరాశ కలిగించిందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తాను గట్టి పోటీ ఇచ్చినట్లు చెప్పారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

శ్రీరాముడి ఆశీస్సులతో మళ్లీ విజయం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (202 సీట్లు)ను దాటేసి.. 260కి పైగా సీట్లలో ఆధిక్యం సాధించింది. ఎన్నికల ఫలితాల తీరుపై సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ కోడలు, బీజేపీ నేత అపర్ణ యాదవ్ మాట్లాడుతూ కులమతాలకు సంబంధం లేకుండా బీజేపీకి అన్ని వర్గాల వారి మద్దతు లభించిందన్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఇలా అందరిలోనూ బీజేపీవాదులు ఉన్నారని అపర్ణ యాదవ్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకునే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీ తప్ప మరో పార్టీ మంచి పాలనను అందించలేదని ఈ తీర్పుతో ప్రజలు సమాధానమిచ్చారన్నారు.

సీఎం చన్నీని ఓడించింది.. మొబైల్ రిపేర్ షాప్ వర్కర్

ఆమ్ ఆద్మీ.. పార్టీ కాదు, ఓ విప్లవమని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్, సుఖ్ బీర్ సింగ్లను ఓడించి పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారని అన్నారు. ఆమ్ ఆద్మీ తరఫున పోటీ చేసిన ఓ సాధారణ వ్యక్తి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చన్నీని ఓడించిన వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపులో పనిచేస్తారని, ఆయన తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో క్లీనర్ అని చెప్పారు. ఓ సాధారణ వాలంటీర్ మజీతియాను ఓడించారన్న కేజ్రీవాల్.. సామాన్యులు పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ సింగ్ మాన్కు అభినందనలు తెలిపారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆప్ జాతీయ శక్తిగా అవతరించింది

ఆప్ ఇప్పుడు జాతీయ శక్తిగా అవతరించిందని ఆప్ కీలక నేత రాఘవ్ చద్దా అన్నారు. ఆప్ ఇక ప్రాంతీయ పార్టీ కాదని.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయబోతోందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా ఆప్ కు ఇవాళ అద్భుతమైన సుదినం అని అభివర్ణించారు. దేవుడి ఆశీస్సులతో తమ నేత అరవింద్ కేజ్రీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు సీట్లు గెలుచుకోవడానికి చాలా కాలం ఎదురు చూసిందని.. అయితే తమ పార్టీ 2012లోనే ఏర్పాటై ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

యూపీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నయ్

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. యోగి నాయకత్వాన్ని యూపీ ప్రజలు బలపరిచారని ఆయన అన్నారు. ఇక నెక్స్ట్ తెలంగాణనే బీజేపీ టార్గెట్ అని, ఎప్పడు ఎన్నికలు జరిగినా గెలిచేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయని, తెలంగాణలో కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కించేస్తామని అన్నారు. ఇక ఎంఐఎం పార్టీ డబ్బుల కోసమే దేశమంతా పోటీ చేస్తోందని ఆరోపించారు.

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును వినయపూర్వకంగా స్వీకరిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, వాలంటీర్ల అంకితభావానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పారు.

పంజాబ్లో ఆప్ దెబ్బకు ఓడిన ప్రముఖులు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దెబ్బకు బడా బడా నేతలు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ పోటీ చేసిన బదౌర్, చమ్కూర్ సాహిబ్ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ  ఆప్ అభ్యర్థి జీవన్ జీత్ కౌర్ చేతిలో ఓడిపోయారు.  మోగా స్థానం నుంచి బరిలో దిగిన సోనూసూద్ సోదరి మాళవిక, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదర్, సుఖ్ బీర్ సింగ్ లను ఆమ్ ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. (పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నెక్స్ట్  ఫోకస్ తెలంగాణ, ఏపీలపైనే.. నఖ్వీ

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయని, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఇక తర్వాతి ఫోకస్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికలపైనే అని ఆయన అన్నారు. 

భగవంత్ మాన్ ఘన విజయం

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీందర్ సింగ్ గోల్డీ పై 45 వేల ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.

ఇది కార్యకర్తల విజయం.. ప్రమోద్ సావంత్

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. అధికారం దిశగా పయనిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా అక్కడి సీఎం ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. ఈ విజయం కార్యకర్తలదేనన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సీఎంలు వీళ్లే..?

యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ గెలపు దిశగా పయనిస్తోంది. ఇక పంజాబ్ లో ఆప్ విజయం వైపు దూసుకెళ్తోంది. కాగా .. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు కాబోయే ఎవరంటూ చర్చ జరుగుతోంది. యూపీలో యోగి, గోవాలో ప్రమోద్ సావంత్, మణిపూర్ లో బిరెన్ సింగ్, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ దామి, పంజాబ్ లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ప్రజా తీర్పే .. దేవుడి తీర్పు:సిద్ధూ

పంజాబ్ ప్రజల తీర్పును.. దేవుడి తీర్పుగా భావిస్తున్నామన్నారు  కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఓటమిని అంగీకరిస్తున్నామని..అఖండ విజయం దిశగా దూసుకెళ్తున్న ఆప్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సిద్ధూ. 

పంజాబ్ ప్రజలకు ధన్యవాదాలు.. కేజ్రీవాల్

పంజాబ్లో ఆప్ అఖండ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సరికొత్త విప్లవానికి నాంది పలికిన పంజాబ్ ప్రజలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్.

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పటియాల నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లి చేతిలో పరాజయం పాలయ్యారు.

పంజాబ్ కు బయలుదేరిన కేజ్రీవాల్

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాజధాని చండీఘడ్ కు బయలుదేరారు.

కేజ్రీవాల్, భగవంత్ మన్ కు ఓటేసిన పంజాబ్ ప్రజలు.. రాఘవ్ చద్ధా

‘అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్ ద్వయాన్ని పంజాబ్ ప్రజలు ఆదరించారు. మిగతా పార్టీల వాళ్లు మాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ ను టెర్రరిస్ట్ తో పోల్చారు. కానీ ఇక్కడి ప్రజలు కేజ్రీవాల్ మీద ఉన్న నమ్మకంతో అవన్నీ తప్పని రుజువు చేశారు’ అని అన్నారు ఆప్ పంజాబ్ లీడర్ రాఘవ్ చద్ధా.

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ వెనుకంజ

ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ హరీశ్ రావత్ 10 వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు.
 

యోగి, అఖిలేష్ విజయం

యూపీ సీఎం యోగి, ఎస్పీ అధినేత అఖిలేష్ విజయం సాధించారు.

సిద్ధూ ఓటమి

పంజాబ్ లోని అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమి పాలయ్యారు.

ఓటమి దిశగా సోనుూసూద్ సోదరి 

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజలో ఉన్నారు. సోనూసూద్ కరోనా లాక్‌డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సోదరి తరపున ప్రచారం కూడా చేశాడు.

ఇది ప్రజల విక్టరీ: మనీశ్ సిసోడియా

‘పంజాబ్ ప్రజలు మార్పు కోరుకున్నారు. కేజ్రీవాల్ మార్క్ పాలనకు వారు ఓ అవకాశం ఇచ్చారు. నేటి ఫలితాలతో జాతీయస్థాయిలో కేజ్రీవాల్ మోడల్ పాలనకు పునాదులు పడ్డాయి. ఇది సాధారణ ప్రజల (ఆమ్ ఆద్మీ) విజయం’అని ఆప్ లీడర్ మనీశ్ సిసోడియా చెప్పారు. 

పంజాబ్ లో కేజ్రీవాల్ మేనియా.. అధికారం దిశగా ఆప్

పంజాబ్‌లో అద్భుతం జరిగింది. చీపురు పార్టీ.. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన మ్యానిఫెస్టో, హామీలకు ప్రజలు ఫిదా అయిపోయారు.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హేమాహేమీలను మట్టికరిపించింది. అధికార కాంగ్రెస్‌, ప్రాంతీయ ఆదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్‌, మరో జాతీయ పార్టీ బీజేపీలకు కామన్‌గా షాక్‌ ఇచ్చింది ఆప్‌. ఫలితాలు నువ్వే-నేనా అన్నట్టు  ఉంటాయనుకుంటే వార్ మాత్రం వన్ సైడ్ గా మారిపోయింది. పంజాబ్ ప్రజలు హస్తంకు హ్యాండ్ ఇచ్చి చీపురుకే జై కొట్టారు. అందుకే ఫలితాల్లో ఆప్ సత్తా చాటుతోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. 

రాష్ట్రంలో మొత్తం 117 సీట్లలో ఆప్ మేజిక్ ఫిగర్ ను దాటింది. దాదాపు  90 సీట్లలో లీడ్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలో లీడ్ లో కొనసాగుతూ సెకండ్ ప్లేస్ కే పరిమితమైంది.రెండోసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ఇక అకాలీదళ్, బీజేపీ చెరో రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59. అయితే ఇప్పటికే ఆప్‌ ఆ ఫిగర్‌ను దాటేసింది. ఫోన్‌ కాల్‌ స్పందన ద్వారా ఎంపిక చేసిన సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాల్లో పంజాబ్‌ ఆప్‌ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆప్ ఆఫీసుల వద్ద బాణా సంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు కార్యకర్తలు. డప్పులు వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఉత్తరాఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ

మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 44 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసింది.

పార్టీ ఆఫీస్ కు చేరుకున్న అఖిలేష్

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు వెలువడిన యూపీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎస్పీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

మణిపూర్ మణిహారం బీజేపీదే

మణిపూర్​లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వస్తోంది.మొదటి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. రౌండ్ రౌండ్ కు కమలం పార్టీ మెజార్టీ సీట్లలో లీడ్ లో దూసుకుపోతోంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా..బీజేపీ 24 సీట్లలో మెజార్టీ సీట్లల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ఇక జేడీయూ కేవలం 6 స్థానాలు, ఇతరులు 8 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.

రెండు స్థానాల్లో ఓటమి దిశగా పంజాబ్ సీఎం

చమ్ కౌర్ సాహిబ్, భాదౌర్  స్థానాల్లో పోటీ చేస్తున్న పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ ఛన్నీ.

గోవాలో పార్టీవైజ్ రిజల్ట్స్ అప్డేట్

వెనుకంజలో సిద్ధూ

పంజాబ్ లోని అమృత్సర్ ఈస్ట్ స్థానానికి గాను కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన నవజ్యోత్ సింగ్ సిధ్దూ వెనుకంజలో ఉన్నారు.

మణిపూర్ లో పార్టీవైజ్ రిజల్ట్స్ అప్డేట్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...  ఆప్ మంత్రి గోపాల్ రాయ్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే పంజాబ్ ప్రజలు ఆప్ ను ఆదరించారని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.

మణిపూర్, ఉత్తరాఖండ్ లో అధికారం దిశగా బీజేపీ

మణిపూర్, ఉత్తరాఖండ్ లో అధికారం దిశగా బీజేపీ దూసుకుపోతోంది.

వెనుకంజలో శివ్పాల్ సింగ్ యాదవ్

యూపీలో జస్వంత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ అభ్యర్థి  శివ్పాల్ సింగ్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. 

 

యూపీలో పార్టీవైజ్ రిజల్ట్స్ అప్డేట్

పంజాబ్ లో అధికారం దిశగా ఆప్ 

పంజాబ్ లో ఆమ్ ఆద్మీపార్టీ తొలిసారి అధికారాన్ని దక్కించుకోనుంది.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హేమాహేమీలను మట్టికరిపించింది. కాంగ్రెస్ కు అందనంత దూరంగా మెజార్టీ స్థానాలను దక్కించుకునే దిశగా పయనిస్తోంది. ఫలితాలు నువ్వే-నేనా అన్నట్టు  ఉంటాయనుకుంటే వార్ మాత్రం వన్ సైడ్ గా మారిపోయింది. పంజాబ్ ప్రజలు హస్తంకు హ్యాండ్ ఇచ్చి చీపురుకే జై కొట్టారు.అందుకే ఫలితాల్లో ఆప్ సత్తా చాటుతోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే చీపురు పార్టీ కాంగ్రెస్ ను ఊడ్చేసినట్టు కనిపిస్తోంది.రాష్ట్రంలో మొత్తం 117 సీట్లలో ఆప్ మేజిక్ ఫిగర్ ను దాటింది. దాదాపు  88 సీట్లలో లీడ్ లో కొనసాగుతోంది ఆప్. కాంగ్రెస్ కేవలం 14 సీట్లలో లీడ్ లో కొనసాగుతూ సెకండ్ ప్లేస్ కే పరిమితమైంది. ఫలితాలు ఇలాగే ఉంటే కన్ఫామ్ గా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం హస్తం గతం చేసుకునే అవకాశం ఉంది. రెండోసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కన్న కలలు కల్లలుగా మిగిలిపోనున్నాయి. ఇక అకాలీదళ్, బీజేపీ చెరో రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ముందు చెప్పిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఫలితాలు కూడా అదే విధంగా వెలువడుతున్నాయి. 

వెనుకంజలో గోవా సీఎం

గోవా సీఎం ప్రమోద్ సావత్ వెనుకంజలో ఉన్నారు.

పంజాబ్ లో మొదలైన ఆప్ సంబరాలు

ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి ముందు  ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

 

మణిపూర్ లో హోరాహోరీ

మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది.

పనాజీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన సీఎం ప్రమోద్ రావత్

గోవాలోని పనాజీ కౌంటింగ్ కేంద్రానికి ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ రావత్ చేరుకున్నారు. భద్రతా, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. 

యూపీలో బీజేపీ హవా

ఉత్తర్ ప్రదేశ్ లో మళ్లీ బీజేపీ హవా కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. మెజార్టీ మార్క్ దిశగా పయనిస్తోంది. ఇప్పటికే 150 సీట్లకు పైగా స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు కమలం పార్టీ అభ్యర్థులు. కొద్దిసేపటిలో డబుల్ సెంచరీ మార్క్ కు చేరుకునే అవకాశం ఉంది. ఫలితాల ట్రెండ్స్ ను బట్టి చూస్తే ట్రిపుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యం లేనట్టు కనిపిస్తోంది. విపక్షాలన్నీ కలసినా మూడెంకల స్కోరు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ప్రతిపక్షాలు మొత్తం కలసి డబుల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. సమాజ్ వాదీ పార్టీ గట్టిగా పోటీ ఇస్తుందని భావించినా.. ఫలితాలను బట్టి చూస్తే మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదు. ఇక బీఎస్పీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా దాటడం కష్టంగా మారింది. మొత్తానికి రెండోసారి ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అఖిలేష్

వెనుకంజలో కెప్టెన్ అమరీందర్ సింగ్

పంజాబ్ లోని పటియాల నుంచి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర మాజీ  సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు.

అభ్యర్థుల్లో టెన్షన్... దేవుళ్లకి పూజలు

ఓట్ల కౌంటింగ్ మొదలవడంతో అభ్యర్థులు టెన్షన్ గా ఫీలవుతున్నారు. కొంతమంది అభ్యర్థులు తమను ఎలాగైనా గెలిపించాలని తమ ఇష్ట దైవాలకు మొక్కుకుంటున్నారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇంఫాల్ లోని శ్రీ గోవిందాజీ దేవాలయాన్నిసందర్శించి దేవున్ని మొక్కుకున్నారు.  పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ ఛన్నీ తన కుటుంబంతో కలిసి గురుద్వార ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా శ్రీ దత్త మందిర్ వెళ్లి దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా చాలా మంది అభ్యర్థులు ఇలా గుళ్ల చుట్టూ తిరుగుతూ గెలుపు కోసం దేవుళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

లీడింగ్ లో ఆదిత్యనాథ్

యూపీ సీఎం అభ్యర్థి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్  నుంచి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన లీడింగ్ లో కొనసాగుతున్నారు.

కొనసాగుతున్న కౌంటింగ్

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. యూపీలో బీజేపీ 116 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ పార్టీ 77 సెగ్మెంట్లలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. బీజేపీ2, కాంగ్రెస్ 2 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 20, ఆప్ 35 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. గోవాలో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. 28 స్థానాలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా..కాంగ్రెస్ 29 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ఆప్ రెండు స్థానాల్లో, ఇతరులు ఒక సెగ్మెంట్ లో ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్ మొత్తం 60 స్థానాలు ఉండగా..బీజేపీ 16, కాంగ్రెస్ 13 సెగ్మెంట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కూడా యూపీలో బీజేపీ హవా కొనసాగింది. పంజాబ్ లో కాంగ్రెస్ కంటే ఆప్ కే పోస్టల్ బ్యాలెట్  ఓట్లు దక్కాయి.