రెండు కూటములకు ఐదు రాష్ట్రాల అగ్నిపరీక్ష

రెండు కూటములకు ఐదు రాష్ట్రాల అగ్నిపరీక్ష

లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల కూటముల హడావుడి మొదలైంది. ఎన్నికలకు పది నెలల గడువుండగానే దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి, ఢిల్లీ వేదికగా ‘ఎన్‌‌‌‌డీఏ’ కూటమి బలప్రదర్శనకు దిగాయి. బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌‌‌‌ ‘యూపీఏ’ స్థానంలో ‘ఇండియా’(ఇండియన్‌‌‌‌ నేషనల్‌‌‌‌ డెవలప్​మెంటల్‌‌‌‌ ఇంక్లూజివ్‌‌‌‌ అలయెన్స్‌‌‌‌) పేరిట నూతన కూటమిని ఏర్పాటు చేస్తే, ప్రతిపక్షాల కూటమికి పోటీగా ఎన్‌‌‌‌డీఏ విస్తృత సమావేశాన్ని నిర్వహించింది. లోక్‌‌‌‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ కూటములు పోటీ ప్రదర్శన నిర్వహించాయని అభిప్రాయపడుతున్నా, అంతకు ముందే ఈ రెండు కూటములకు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకించి కూటములకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌లకు పెను సవాలే. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ముఖాముఖిగా తలపడబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే వాటిపై విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ముందే నీరుగారిపోయి చిన్న పార్టీలు కూటమి నుంచి వెళ్లొచ్చు. 

చిన్నపార్టీలకు గుర్తింపు

పాట్నా సమావేశం విజయవంతం కావడంతో ప్రతిపక్షాలు రెట్టింపు ఉత్సాహంతో బెంగళూరులో 26 పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాయి. మరోవైపు ప్రతిపక్షాల కూటమి సంఖ్యా బలాన్ని అధిగమించాలనే ఏకైక లక్ష్యంతో ఎన్‌‌‌‌డీఏ 38 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. గత నెలలో పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్య కూటమి సమావేశాన్ని ఒక ‘ఫొటో సెషన్‌‌‌‌’గా అమిత్‌‌‌‌ షా వ్యాఖ్యానించినా ఆ భేటీని బీజేపీ సీరియస్‌‌‌‌గానే తీసుకుందని చెప్పడానికి ఢిల్లీలో ఎన్‌‌‌‌డీఏ విస్తృత సమావేశం నిర్వహించడమే నిదర్శనం. ఈ రెండు మీటింగుల్లో పాల్గొన్న పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఎన్‌‌‌‌డీఏ సమావేశానికి హాజరైన పార్టీల్లో దాదాపు పాతిక పార్టీలకు లోక్‌‌‌‌సభలో ప్రాతినిధ్యమే లేదు. మరో తొమ్మిది పార్టీలు ఒక్కో స్థానం కలిగున్నాయి. యూపీఏ సమావేశానికి హాజరైన పార్టీల్లో పది పార్టీలకు లోక్‌‌‌‌సభలో ప్రాతినిధ్యమే లేదు. ఐదు పార్టీలు ఒక్కో స్థానం కలిగున్నాయి. సంఖ్యా బలాన్ని పక్కనపెడితే ప్రాంతీయ, చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తే స్థానిక పరిస్థితులు, సామాజిక, ప్రాంతీయ ప్రాతిపదికన ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రకాశ్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ నేతృత్వంలోని వంచిత్‌‌‌‌ బహుజన్‌‌‌‌ అగాధి ఒక్క స్థానం కూడా గెలవకపోయినా, 7% ఓట్లు సాధించింది. ఈ పార్టీ ప్రభావంతో యూపీఏ మూడు స్థానాలను కోల్పోవడం గమనార్హం. బీహార్‌‌‌‌లో లోక్‌‌‌‌ జనశక్తి పార్టీ 8 శాతం ఓట్లతో పోటీచేసిన 6 స్థానాల్లో గెలవడమే కాకుండా 39 చోట్ల ఎన్‌‌‌‌డీఏ విజయం సాధించడానికి తోడ్పడింది. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ చిన్న పార్టీలతో జతకట్టడానికి తహతహలాడుతున్నాయి.

సంకీర్ణ ధర్మాన్ని తప్పిన బీజేపీ

వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు ప్రాంతీయ పార్టీలను ఉపయోగించుకున్న బీజేపీ పలు సందర్భాల్లో పిల్లలను మింగేసిన పాములా వ్యవహరించింది. వాజ్‌‌‌‌పేయి, ఎల్‌‌‌‌కే అద్వానీ నేతృత్వంలోని ఎన్‌‌‌‌డీఏ మిత్రపక్షాలకు ప్రాధాన్యమిచ్చేది. 2004లో మిత్రపక్షమైన టీడీపీ నేత చంద్రబాబు సూచనల మేరకు ఎన్‌‌‌‌డీఏ ముందస్తు ఎన్నికలకు వెళ్లి నష్టపోయింది. అందుకు భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారు. ఏపీలో టీడీపీతో, మహారాష్ట్రలో శివసేనతో, బీహార్‌‌‌‌లో జేడీ(యూ)తో, పంజాబ్‌‌‌‌లో అకాళీదళ్​తో, కర్నాటకలో జేడీ(ఎస్‌‌‌‌)తో, అస్సాంలో అస్సాం గణపరిషత్‌‌‌‌తో, జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఒకసారి నేషనల్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌తో, మరోమారు పీడీపీతో జతకట్టిన బీజేపీ.. బలపడ్డాక ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చింది. దీంతో ఆ పార్టీలు బీజేపీని విశ్వసించడం లేదు. దేశంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న బీజేపీకి కర్నాటక ఎన్నికలు షాకిచ్చాయి. రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశాజనకమైన ఫలితాలు రావడం అంత సులభం కాదని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ‘‘దేశంలో ప్రాంతీయ పార్టీలు మాయమవుతాయి..’’ అని నిరుడు పాట్నాలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యానించగా, ఇప్పుడు ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం కోరుకుంటున్నది. 

కాంగ్రెస్‌‌‌‌ పెద్దన్న పాత్ర పోషిస్తుందా..?

రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌ భవిష్యత్తులో మోదీని ఎదుర్కోవడం అంత సులభం కాదని గుర్తించి ఐక్య కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. బెంగళూరు సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి పీఠం, అధికారం కాంగ్రెస్‌‌‌‌ లక్ష్యాలు కావని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణ కోసం మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తమ ధ్యేయమని చేసిన ప్రకటన మిత్రపక్షాలను ఆకట్టుకున్నా, అదే సమయంలో కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత చిదంబరం ‘ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్‌‌‌‌ పాత్ర ప్రత్యేకం...’ అని వ్యాఖ్యానించడం అనుమానాలు రేకింతవచ్చు. మొత్తం 543 లోక్‌‌‌‌సభ స్థానాల్లో 450 చోట్ల బీజేపీతో ముఖాముఖి తలపడే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌‌‌‌, ఇతర ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నా ఆచరణలో మాత్రం అది అంత సులభం కాకపోవచ్చు. పశ్చిమబెంగాల్‌‌‌‌లో మమతా బెనర్జీ బీజేపీతోపాటు వామపక్షాలతో కూడా తలపడుతోంది. కేరళాలో వామపక్షాలు, కాంగ్రెస్‌‌‌‌ మధ్య ముఖాముఖి పోటీ ఉంది. యూపీ వంటి చోట కాంగ్రెస్‌‌‌‌ త్యాగాలు చేయాలని ఇప్పటికే అఖిలేష్‌‌‌‌ యాదవ్‌‌‌‌ కోరారు. దీంతో బీజేపీని పీఠం దింపాలంటే కాంగ్రెస్‌‌‌‌ పెద్దన్న పాత్ర పోషించి త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమిలో కాంగ్రెస్‌‌‌‌ ఆధిపత్యం కొనసాగాలంటే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటూ, మధ్యప్రదేశ్‌‌‌‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తే ‘ఇండియా’లో ఆ పార్టీ పరపతి పెరుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల పార్టీల రూటే సపరేటు

తెలుగు రాష్ట్రాల నేతలైన చంద్రబాబు, కేసీఆర్‌‌‌‌ గతంలో మోదీకి వ్యతిరేకంగా పావులు కదిపినా ‘ఇండియా’ కూటమి వీరిని విశ్వసించడం లేదు. 1999, 2014లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు 2019 ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడాయన ఏపీ రాజకీయాలకే పరిమితమయ్యారు. మరోవైపు ఏపీలో కీలకంగా మారుతున్న జనసేన ఎన్‌‌‌‌డీఏ సమావేశానికి హాజరైంది. రాష్ట్రంలో జగన్‌‌‌‌ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏర్పడుతుందని పవన్‌‌‌‌ చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే సంకేతాలతో కేసీఆర్‌‌‌‌ ‘టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌’ను ‘బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌’గా మార్చి మోదీపై యుద్ధం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున తరుణంలో కేసీఆర్‌‌‌‌ బీజేపీపై విమర్శలను తగ్గించడంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ మధ్య వ్యూహాత్మక అవగాహన కుదిరిందనే ప్రచారం జోరందుకుంది. 

తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో ముఖాముఖి తలపడాల్సి ఉండటంతో కాంగ్రెస్‌‌‌‌ ఆ పార్టీని ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంచుతోంది. దేశ రాజకీయాల్లో గతంలో చురుకైన పాత్ర పోషించిన తెలుగు నేతలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా ఏకచ్ఛత్రాధిపత్యం అసంభవం అని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ పార్టీలు మిత్రపక్షాలను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి. అయితే ఈ పార్టీలపై కూటమిలోని చిన్నపార్టీలకు విశ్వాసం కలగాలంటే ఈ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే దోరణితో ఉంటేనే ప్రయోజనం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటేనే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వంపై కూటమిలోని ఇతర పక్షాలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రెండు పార్టీల్లో దేనికైనా ఆదరణ తగ్గినట్టు ఫలితాలొస్తే మాత్రం కూటమిలోని మిత్రపక్షాలు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి కూటమిలో చేరే అవకాశాలుండటంతో మొదటికే మోసం ఏర్పడుతుంది.

- ఐ.వి. మురళీ కృష్ణ శర్మ, పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ