- వాంతులు, విరేచనాలు అవుతుండగా ఆస్పత్రికి తరలింపు
- స్టూడెంట్స్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న డీఎంహెచ్ వో
- ఫుడ్ నాణ్యతతో వండటం లేదంటూ ఎంఐఎం నేతల ఆరోపణ
నిర్మల్, వెలుగు: మైనార్టీ రెసిడెన్షియల్ లో పలువు రు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నిర్మల్ టౌన్ సమీపంలోని చించోలిలో జరిగింది. సోమవారం రాత్రి స్కూల్ లో విద్యార్థులు అన్నం తిన్నారు. మంగళవారం ఉదయం పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమాచారం అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్ఓ రాజేందర్ తెలిపారు. స్కూల్ లో అందిస్తున్న ఫుడ్ నాణ్యతతో ఉండడం లేదని, కూరగాయలను శుభ్రం చేయకుండానే సిబ్బంది వంట చేస్తున్న కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఎంఐఎం నేత రఫీ ఖురేషి, కౌన్సిలర్ ముజాహిద్ ఆరోపించారు.
ఫుడ్ పాయిజన్ కాదు : నిర్మల్ కలెక్టర్
చించోలి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణం కాదని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. విద్యార్థులు ఆహారం అతిగా తీసుకోవడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు.