హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 5 వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10 వేల 54 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అంటే 5 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి.
ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయిలో విచ్చిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడినపెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
వాళ్లకు బాధ్యతలు ఏమిటంటే?
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్న పోస్టుల డ్యూటీ చార్జ్‌లో చేర్చనున్నట్లు తెలిసింది. గ్రామానికొక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్‌కం వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు (మ్యానువల్ పహాణీలు), చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు సమాచారం.
ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్‌లో అసిస్టెన్స్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టుల్లోనే వారికే అప్పగించేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2020 అక్టోబర్‌కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి. రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
డిగ్రీ అర్హతతో
క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్వో, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం వంటి పనులు చేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ 2024ను చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తున్నది. అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించబోతున్నరానే విషయాన్ని ప్రకటించునున్నట్లు సమాచారం.
రెవెన్యూ సేవలు కొనసాగించడానికి
గత ప్రభుత్వం ఒకవైపు ధరణి తీసుకువచ్చి.. అదే టైంలో గ్రామాల్లోని రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి రైతులను ఆగం చేసింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లు అనిపిస్తుంది. ఇష్టమొచ్చినట్లు భూములు అటు ఇటు చేస్తే ఎవరు గుర్తించకుండా ఉండేందుకే గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా చేశారు. ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తున్నాం. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గ్రామాల్లో రెవెన్యూ సేవలను కొనసాగించడానికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమిస్తం. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం.-
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి