- రాణించిన జంపా, ఇంగ్లిస్, మార్ష్
- 5 వికెట్లతో శ్రీలంకపై విజయం
- లంకకు హ్యాట్రిక్ ఓటమి
లక్నో: ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. శ్రీలంక హ్యాట్రిక్ ఓటమి ఖాతాలో వేసుకుంది. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (4/47) స్పిన్ మ్యాజిక్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన లంక 43.3 ఓవర్లలో 209 రన్స్‌కే కుప్పకూలింది.
ఓపెనర్లు కుశాల్ పెరీరా (78), పాథుమ్ నిశాంక (61) తొలి వికెట్‌కు121 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. కానీ, జంపా, స్టార్క్ (2/43), కమిన్స్ (2/32) దెబ్బకు 52 రన్స్ తేడాతో లంక ఆఖరి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. చరిత్ అలసంక (25) కాసేపు ప్రతిఘటించగా.. కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వ (7) ఫెయిలయ్యారు.
అనంతరం ఆసీస్ 35.2 ఓవర్లలోనే 215/5 స్కోరు చేసి గెలిచింది. స్టీవ్ స్మిత్ (0), డేవిడ్ వార్నర్ (11) నిరాశ పరచడంతో ఆరంభంలోనే 24/2తో ఆసీస్ ఇబ్బంది పడింది. కానీ, ఓపెనర్ మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబుషేన్ (40)తో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్ (31 నాటౌట్), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో టార్గెట్‌ను అందుకుంది. లంక బౌలర్లలో మదుషంక మూడు వికెట్లు తీశాడు. జంపాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గాలికి కిందపడ్డ హోర్డింగ్స్
ఈ మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించింది. వానకు తోడు బలమైన గాలుల కారణంగా స్టేడియం పైకప్పు నుంచి పలు ఐరన్ హోర్డింగ్స్ కింది సీట్లపై పడ్డాయి. ఆ సీట్లలో ఫ్యాన్స్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కింద స్టాండ్స్‌లోని వాళ్లంతా పైస్టాండ్స్‌కు వెళ్లాలని స్టేడియంలో అనౌన్స్ చేయడంతో అభిమానులు కంగారు పడ్డారు. ఇదే స్టేడియంలో ఈ నెల 29న ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది.