సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ గిరిజన బాలికల వసతి గృహంలో ఐదుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. బయట కొనుగోలు చేసిన సమోసాలు తిన్న వారే అస్వస్థతకు గురైనట్లు ఆధికారులు గుర్తించారు. బాలికలు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దుర్గా, కనిష్మ, పూజిత, మహేశ్వరి, అక్షిత స్కూల్ విరామ సమయంలో స్కూల్ బయట సమోసాలు కొనుగోలు చేసి తిన్నారు. రెండు గంటల తర్వాత సమోసాలు తిన్న ఐదుగురు వాంతులు చేసుకున్నారు.
దీనితో స్కూల్ పక్కనే ఉన్న పీహెచ్సీ లో ట్రీట్మెంట్ అందించి తిరిగి స్కూల్ కు పంపించారు. స్పృహ తప్పిన స్టూడెంట్లను గమనించిన ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న హాస్టల్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వేణుమాధవ్, డిప్యూటీ డీఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డీటీడీఓ శంకర్ నాయక్ ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల పరిస్థితి మెరుగుపడినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉండడంతో తిరిగి హాస్టల్కు తరలించారు.