ముదురుతున్న ‘ఇథనాల్’ లొల్లి.. ఆందోళనలు తీవ్రరూపం

  • ముదురుతున్న ‘ఇథనాల్’ లొల్లి
  • ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న ఐదు గ్రామాల ప్రజలు
  • కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం
  • పోలీసులపై దాడిచేశారంటూ తొమ్మిది మందిపై  కేసులు
  • తాము ఏమీ చేయలేదని కోటిలింగాలలో గ్రామస్తుల ప్రమాణం
  • మంత్రి కొప్పుల తీరుపై తీవ్ర విమర్శలు 
  • జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో పెరుగుతున్న ఉద్రిక్తత

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలంలో  నిర్మించతలపెట్టిన ఇథనాల్ ​ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సమీప గ్రామాల్లో మొదలైన ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్​ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని పాశిగామ, స్తంభంపల్లి, కోటి లింగాల, వెల్గటూర్, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు రోజుకో చోట నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో అడ్డుతగులుతున్న పోలీసులకు, నిరసనకారులకు నడుమ లొల్లి ముదురుతోంది. ఇటీవల స్తంభంపల్లి గ్రామస్తులు బోనాలు సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  తమపై దాడి చేశారంటూ తొమ్మిది మంది యువకులపై కేసులు పెట్టడం వివాదాస్పదమైంది. తాము పోలీసులపై దాడి చేయలేదంటూ పాశిగామ, స్తంభంపల్లి గ్రామస్తులు మంగళవారం కోటిలింగాల శివాలయంలో దేవుడిపై ప్రమాణం చేశారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఫ్యాక్టరీకి అనుమతి, భూములు ఇవ్వడమే కాకుండా.. మంత్రి కొప్పుల సహా కొంతమంది లీడర్లు, పోలీసులతో తమపై ఉల్టా కేసులు పెట్టించడం అన్యాయమని ఐదుగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నెల రోజులుగా ఆందోళన.. 

క్రిబ్​కో ఆధ్వర్యంలో వెల్గటూర్​ మండలంలో రూ.700 కోట్లతో ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. టీఎస్ఐఐసీ నుంచి వచ్చిన ఆదేశాలతో జగిత్యాల కలెక్టర్ ​పాశిగామ, స్తంభంపల్లి గ్రామాల మధ్య ఉన్న 120 ఎకరాల సర్కారు భూములు కేటాయించారు. మరో 80 ఎకరాల ప్రైవేట్ ​భూములను సేకరించాలనుకుంటున్నారు. ఇథనాల్​ ఫ్యాక్టరీ వల్ల  భూమి, నీరు కలుషితమై రోగాలబారిన పడ్తామని చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లోని పెద్దలు కరీంనగర్ ​జిల్లా తిమ్మాపూర్​మండలంలోని పర్లపల్లిలో ఇప్పటికే స్థాపించిన ఇథనాల్​ ఫ్యాక్టరీని ప్రత్యక్షంగా చూసి, అక్కడి వాళ్లతో మాట్లాడివచ్చాక మరింత భయపడుతున్నారు.

పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన లీడర్లు, ఆఫీసర్లు ఉల్టా పోలీసులతో బెదిరింపులకు దిగుతుండడంపై గ్రామస్తులు మండిపడ్తున్నారు. మార్చి 31న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్  ఫ్యాక్టరీ కోసం భూమి పూజ చేయడంతో గ్రామస్తుల ఆగ్రహం రెట్టింపయ్యింది. మంత్రి వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా  5 గంటల పాటు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 1న పాశిగామలో అధికార పార్టీ పాలకవర్గం అనుబంధ శాఖలు ముకుమ్మడిగా రాజీనామాలు చేసి అక్కడే ఉన్న బీఆర్ఎస్ జెండా గద్దెను ధ్వంసం చేసేందుకు వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ ప్రకాశ్ వచ్చి గ్రామస్తులకు సర్ధి చెప్పాల్సి వచ్చింది. ఏప్రిల్ 2న స్తంభంపల్లి, పాశిగామ, వెంకటాపూర్, వెల్గటూర్ జీపీల్లో ఫ్యాక్టరీ పర్మిషన్​ రద్దు చేయాలని తీర్మానాలు చేశారు. ఏప్రిల్ 5న సాయిల్ టెస్ట్ కోసం వచ్చిన ఆఫీసర్లను గ్రామస్తులు  అడ్డుకొని మూడు గంటల పాటు నిరసన తెలిపారు. 


ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోవడంతో పోలీసులు టెస్టులు నిలిపివేశారు. ఏప్రిల్ 6న ఆర్డీవో మాధురి, డీఎస్పీ ప్రకాశ్ గ్రామస్తులతో 
సమావేశమై ఇథనాల్ ప్రాజెక్టుపై అవగాహన కల్పించినా ఒప్పుకోలేదు. ఏప్రిల్ 26న ఇథనాల్ ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలంలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయగా, గ్రామస్తులు అడ్డుకోవడం తో పోలీసులు జేసీబీలను పంపించివేశారు. ఏప్రిల్ 27న ఇథనాల్ ప్రాజెక్టు రద్దు చేయాలని పాశిగామ గ్రామస్తులు మైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలకు వస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అడ్లూరిలను పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు. ఈ నెల 1న తెలంగాణ జన సమితి స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్​ కోదండరాం గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు.  

తొమ్మిది మందిపై కేసులు

గత నెల 30న స్తంభంపల్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు వెళ్లారు..మార్గ మధ్యలో ఇథనాల్ ప్రాజెక్టుకు కేటాయించిన స్థలం ఉండడంతో మరో వైపు నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. తిరిగి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు ఎక్కువవుతుందని,  ఇదే దారిలో వెళ్తామని వారించడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత పోలీసులను దాటుకుని వెళ్లిన గ్రామస్తులు బోనాలు సమర్పించి ఇథనాల్ ప్రాజెక్టు రద్దు చేయాలని మొక్కుకున్నారు. అయితే, గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారని  ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ ఎస్సై 9 మంది యువకులతో పాటు  మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దీంతో ఇథనాల్ ప్రాజెక్టు రద్దు కోసం చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని బాధిత యువకులు ఆరోపిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వరే ఇదంతా చేయిస్తున్నారని, పోలీసులు ఆయన చెప్పినట్టే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.