- 2006లో చార్జిషీట్ అనుకూలంగా వేస్తానని డబ్బులు డిమాండ్
- పట్టుకున్న ఏసీబీ17 ఏండ్ల తర్వాత శిక్ష ఖరారు
కరీంనగర్ క్రైం, వెలుగు:అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఓ ఎస్సై కి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..కామారెడ్డిలోని వివేకానంద కాలనీకి చెందిన రంగా ధర్మాగౌడ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడి కొడుకు నరేశ్‌గౌడ్ (19)డిగ్రీ చదువుతూ ఇంటి సమీపంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకుని ఆమె కుటుంబసభ్యులకు తెలియకుండా తీసుకు వెళ్లాడు. దీంతో అమ్మాయి తండ్రి ఫిర్యాదు ఇవ్వగా కామారెడ్డి పోలీసులు నరేశ్గౌడ్పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
విషయం తెలుసుకున్న ధర్మా గౌడ్ దుబాయ్ నుంచి కామారెడ్డికి 2006 ఏప్రిల్ 22న వచ్చాడు. అప్పటి కామారెడ్డి ఎస్ఐ మురళీధర్..ధర్మాగౌడ్ ను పిలిచి నరేశ్‌కు అనుకూలంగా చార్జిషీట్వేస్తానని దానికి రూ.6 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పగా చివరికి రూ.5 వేలు ఇవ్వాలని లేకపోతే నిన్ను కూడా కేసులో ఇరికిస్తానని ధర్మాగౌడ్ ను ఎస్సై మురళీధర్ బెదిరించాడు. దాంతో ధర్మాగౌడ్ ఏసీబీని ఆశ్రయించాడు.
2006 ఏప్రిల్ 4న ధర్మాగౌడ్ వద్ద ఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి కుమార్ వివేక్..ఎస్సై మురళీధర్ కు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కేసు నమోదైన నాటి నుంచి తీర్పు వచ్చేవరకు పదిహేడు సంవత్సరాలు పట్టింది. శిక్ష పడ్డ ఎస్సై మురళీధర్ ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ సంగారెడ్డిలో డ్యూటీ చేస్తున్నట్టు తెలిసింది.