యువతిని వ్యభిచారంలోకి దింపేందుకు యత్నించిన..ఐదుగురికి ఏడేండ్ల జైలు

యువతిని వ్యభిచారంలోకి దింపేందుకు యత్నించిన..ఐదుగురికి ఏడేండ్ల జైలు
  • వరంగల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

హనుమకొండ, వెలుగు: ఉద్యోగం వెతుక్కునేందుకు హైదరాబాద్​కు వచ్చిన ఓ యువతిని నమ్మించి బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపేందుకు యత్నించిన కేసులో వరంగల్  ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ.. ఏడేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గద్వాల జిల్లా మల్దకల్​ మండలానికి చెందిన ఓ యువతి(19) తల్లిదండ్రులు లేకపోవడంతో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదివింది.

అనంతరం ఓ ప్రైవేట్​ కంపెనీలో టెలీ కాలర్​గా వర్క్​ ఫ్రం హోం చేసేది. సరిపడా జీతం రావడం లేదని వేరే ఉద్యోగం కోసం గతేడాది మార్చి 10న హైదరాబాద్​ కు వెళ్లింది. ఎంజీబీఎస్​ లో బస్​ దిగగా.. అక్కడ ఉన్న ఓ ఇద్దరు అమ్మాయిలు ఆ యువతితో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు.

తాను దిల్​సుఖ్ నగర్  వెళ్లాలని చెప్పగా.. వ్యభిచార రొంపిలోకి దింపే ప్లాన్​ లో భాగంగానే  ఆమెను నమ్మించి హయత్​నగర్​లోని తమ ఇంటికి తీసుకెళ్లి పాకనాటి మమతకు యువతిని పరిచయం చేశారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో మరునాడు తమ పిన్ని ముద్దంగుల చందన వస్తుందని, ఆమెతో కలిసి దిల్​సుఖ్​నగర్  వెళ్లవచ్చని యువతిని ఆపారు. 

వ్యభిచారం చేయాలని బలవంతం..

13న ముద్దంగుల చందన అక్కడికి చేరుకోగా, దిల్ సుఖ్​నగర్  వెళ్లేందుకు ఆ యువతి రెడీ అయ్యింది. దీంతో చందన సదరు యువతిపై దాడి చేసి, ఆమె బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. అనంతరం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్​కు చెందిన పాకనాటి శివమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె అక్కడికి చేరుకుంది. ఆమెతో బేరం కుదుర్చుకొని, ఆ యువతిని శివమ్మకు అప్పగించింది.

అనంతరం శివమ్మ ఆ యువతిని పిసిపాటి అన్వేశ్​ కారులో వంగపహాడ్ కు తీసుకొచ్చింది. అక్కడ శ్యాంరావ్​ కావ్య ఇంట్లో వదిలేసి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. 14న వ్యభిచార కూపం నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా హసన్​పర్తి స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయగా, కాజీపేట ఏసీపీ తిరుమల్​ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

నేరం రుజువు కావడంతో ముద్దంగుల చందనతో పాటు పాకనాటి శివమ్మ, పాకనాటి మమత, శ్యాంరావ్​ కావ్య, డ్రైవర్​ పిసిపాటి అన్వేశ్​లకు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్  రెండో అదనపు జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి మనీషాశ్రావణ్  తీర్పు చెప్పారు. చందన, మమతకు రూ.6 వేలు, శివమ్మ, కావ్యకు రూ.5 వేలు, అన్వేశ్​ కు రూ.4 వేల చొప్పున జరిమానా విధించారు.