- ఆగిపోయిన 59 రోడ్లు, 32 బ్రిడ్జిల పనులు
- మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ రివ్యూలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలు, స్టేట్ రోడ్స్, బ్రిడ్జిల నిర్మాణాలకు ఐదేండ్లుగా ఫారెస్ట్ పర్మిషన్లు పెండింగ్ లో ఉన్నట్లు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ రివ్యూలో వెల్లడైంది. అధికారుల తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులపై ఇన్నేండ్లుగా ఏంచేస్తున్నారని అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి అడ్డంకిగా మారిందని అన్నారు. శనివారం సెక్రటేరియెట్ లో రోడ్లకు సంబంధించి ఫారెస్ట్ అనుమతులపై ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సెక్రటరీ హరిచందన, నేషనల్ హైవేస్ ఆర్వో కృష్ణప్రసాద్, పీసీసీఎఫ్ డోబ్రీయాల్, ఈఎన్సీ, సీఈలతో మంత్రులు రివ్యూ చేపట్టారు.
రాష్ట్రంలో స్టేట్, నేషనల్ హైవేస్ కు సంబంధించి 59 ప్రాజెక్టులకు, 32 బ్రిడ్జిలకు ఫారెస్ట్ పర్మిషన్లు పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు తెలిపారు. నిలిచిపోయిన వాటిలో ఆరు నేషనల్ హైవేస్ ఉండటంపై మంత్రులు అధికారులపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి కారణమయ్యే రోడ్డు ప్రాజెక్టులకు అటవీ అనుమతులు నిలిచి ఆగిపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఫారెస్ట్ అనుమతులు త్వరగా సాధించేందుకు ఆర్ అండ్ బీ నుంచి ఎస్ఈ స్థాయి ఆఫీసర్ ను నియమిస్తామని మంత్రి సురేఖకు ఆయన తెలిపారు. డీఎఫ్ఓల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను మంత్రి సురేఖ ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ లో అనవసర ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.