
- ఇబ్బందిపడుతున్న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు
- మూడు నెలల్లో నాలుగుసార్లు నిరసనలు
- అటు కేసీఆర్.. ఇటు అధికారులకు పట్టని సమస్య
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు రోజు రోజుకూ జటిలమవుతోంది. ఇండ్లు నిర్మించి ఐదేండ్లు, లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు వారికి ఇండ్లు కేటాయించలేదు. దీంతో గత మూడు నెలల్లో లబ్ధిదారులు నాలుగు సార్లు నిరసలకు దిగారు. మున్సిపాల్టీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తై ఐదేండ్లు కావస్తోంది. మొత్తం 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించగా అందులో 132 పట్టణంలో రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారికి కేటాయించారు. మిగిలిన 1118 ఇండ్ల లబ్ధిదారుల కోసం 2021 లో నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లు స్వీకరించారు. మొత్తం 3512 అప్లికేషన్లు రాగా ఏడాదిన్నర పాటు సర్వే నిర్వహించి 1118 మంది లబ్ధిదారులతో డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించారు. దీనిపై మళ్లీ తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈఏడాది మార్చిలో లక్కీ డ్రా నిర్వహించి 1100 మంది తుది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు.
ఇండ్లు ఖాళీ చేయని నిర్వాసితులు
గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. పరిహారాలు, ప్యాకేజీలు అందిన తర్వాతే తాము ఇండ్లను ఖాళీ చేస్తామనడంతో దాదాపు 400 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులను ఖాళీ చేయించడంలో అధికారులు విఫలమవడంతో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించలేని పరిస్థితి నెలకొంది. కొందరు నిర్వాసితులైతే ఇండ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. దీంతో వారిని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటుండగా మరోవైపు ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇండ్లు ఎప్పుడిస్తారని నిలదీస్తున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముందు నిరసన
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల్లో ఎక్కువ మంది కూలీలే ఉన్నారు. ఇండ్లు లభిస్తే అద్దె మిగులుతుందని వీరు భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇండ్లు అప్పగించకపోవడంతో ఆగ్రహానికి గురువుతున్నారు. ఇండ్ల కేటాయింపు పై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల కాలంలో నాలుగు సార్లు ఆందోళనలకు దిగారు. గతంలో ఇండ్ల కోసం లబ్ధిదారులు ఆత్మహత్యయత్నం కూడా చేశారు. ఒకవైపు నిర్వాసితులను ఖాళీ చేయించలేని పరిస్థితి మరోవైపు లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేని దుస్థితిలో అధికారులు ఆగమవుతున్నారు. రెండు రోజుల క్రితం లబ్ధిదారులు ఏకంగా మాజీ సీఎం ఫామ్ హౌజ్ ముందు నిరసనకు దిగారు. పార్లమెంట్ ఎన్నికల ముందైనా తమకు ఇండ్లు అప్పగిస్తారని లబ్ధిదారులు భావిస్తున్నా అధికారులు, నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
అద్దె ఇండ్లలోనే నివాసం
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దొరికినా ఇప్పటికీ అప్పగించక పోవడంతో అద్దె ఇండ్లలోనే నివాసం కొనసాగిస్తున్నాం. వేల రూపాయల ఆర్థిక భారాన్ని భరిస్తున్నా అధికారులు మాపై కరుణ చూపడం లేదు. ఇప్పటికైనా ఇండ్లను అప్పగిస్తే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.
భాగ్య, లబ్ధిదారు
అధికారుల చుట్టూ తిరుగుతున్నా
లక్కీ డ్రాలో ఇల్లు లభించింది కానీ అప్పగించకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఎక్కడికి వెళ్లినా మాట వినడం లేదు పట్టించుకోవడం లేదు. ఏడాది కాలంగా నిరసనలు ధర్నాలు చేస్తున్నా హామీ ఇస్తున్నారు కానీ ఇళ్లు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్లు అప్పగించాలని కోరుకుంటున్నా.
లక్ష్మి, లబ్ధిదారు