- ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
- వెంటనే వీడియో తొలగింపు
న్యూఢిల్లీ: ఇండియా మ్యాప్‌ను తప్పుగా పోస్ట్ చేసిన వాట్సాప్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ దేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, వ్యాపారం కొనసాగించాలని అనుకుంటున్నారో.. ఆ దేశానికి సంబంధించి సరైన మ్యాప్ ను ఉపయోగించాలని హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా ఈ పొరపాటును సరిదిద్దాలని కోరారు. ట్విట్టర్ వేదికగా మంత్రి స్పందిస్తూ.. వాట్సాప్ మాతృసంస్థ మెటా కంపెనీకి ట్యాగ్ చేశారు.
ఏం జరిగింది..?
నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి వాట్సాప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో గ్లోబ్లో పీవోకే తో పాటు చైనా తనదిగా చెబుతున్న ప్రాంతాలను ఇండియా మ్యాప్ లో నుంచి తొలగించి చూపింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వీడియోను వాట్సాప్ తొలగించింది.