జాబిల్లిపై జెండా పాతినం .. ఇకసూర్యుడిపై అధ్యయనం: ఇస్రో చీఫ్

జాబిల్లిపై జెండా పాతినం .. ఇకసూర్యుడిపై అధ్యయనం: ఇస్రో చీఫ్
  • చంద్రయాన్​-3 సూపర్​ సక్సెస్
  • చందమామ దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశం ఇండియా
  • 20 నిమిషాల తీవ్ర ఉత్కంఠ తర్వాత విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ 
  • 4 గంటలయ్యాక చంద్రుడిపై కాలుమోపిన ప్రజ్ఞాన్ 
  • 14 రోజులు పని చేయనున్న ల్యాండర్, రోవర్
  • అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా 
  • భారత్​కు ప్రపంచ దేశాల కంగ్రాట్స్ 
  • ఇది మానవాళి అందరి విజయం: ప్రధాని మోదీ 

నూటా నలభై కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేస్తూ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని ముద్దాడింది. చివరి ఇరవై నిమిషాల్లో ఏం జరుగుతుందో ఏమోనంటూ అందరూ టెన్షన్​తో ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉండగా.. ఎలాంటి తొట్రుపాటు లేకుండా అవలీలగా దిగిన ల్యాండర్ తన నాలుగు కాళ్లతో నిలబడింది. చంద్రుడిపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండింగ్​తో సత్తా చాటిన ఏకైక దేశంగా ఇండియాను ప్రపంచదేశాల ముందు సగర్వంగా నిలబెట్టింది.

బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సేఫ్​గా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. జులై 14న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం3) రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరిన చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్ ఆగస్ట్ 1న భూకక్ష్యను వీడి చంద్రుడివైపుగా ప్రయాణం ప్రారంభించింది. 3.84 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆగస్ట్ 5న చంద్రుడి కక్ష్యను చేరింది. 

అనంతరం దశలవారీగా కక్ష్యను 100 కిలోమీటర్లకు తగ్గించుకుంది. ఇస్రో సైంటిస్టులు ముందస్తుగా ఇచ్చిన కమాండ్లకు అనుగుణంగా.. బుధవారం సాయంత్రం 5.44 గంటలకు తనంతట తానుగా చివరి ఘట్టాన్ని ప్రారంభించింది. ఇరవై నిమిషాల ఉత్కంఠభరిత ప్రయాణంలో వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిటారుగా నిలబడి సరిగ్గా 6.04 గంటలకు పర్​ఫెక్ట్​గా చంద్రుడిపై ల్యాండ్ అయిపోయింది. ఆ వెంటనే.. ‘నేను గమ్యాన్ని చేరుకున్నా’ అంటూ ఇస్రోకు మెసేజ్ పంపింది. 

దీంతో పదిహేనేండ్ల కిందట జాబిల్లిపై నీరుందని చంద్రయాన్​–1తో ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో... తాజాగా ఎవరికీ సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్​ను రెండో ప్రయత్నంలో పక్కాగా చేసి చూపినట్లయింది.  

ఆ 20 నిమిషాలు.. టెన్షన్ టెన్షన్ 

విక్రమ్ ల్యాండింగ్ కోసం ఇస్రో సైంటిస్టులు 4.44 గంటలకు చివరిసారిగా కమాండ్స్ పంపారు. ఆ తర్వాత 5.44 గంటలకు విక్రమ్ తనంతట తానుగా ఉద్విగ్నభరితమైన ఆఖరి ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగళూరులోని ఇస్రోకు చెందిన మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (మాక్స్)లో సైంటిస్టులంతా కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోయారు. దేశవ్యాప్తంగా లైవ్ చూస్తున్న ప్రజలంతా దాదాపు అదే ఉత్కంఠలో ఉన్నారు. 

మనం మాత్రమే..

ఇప్పటివరకూ సోవియెట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్​ను సాధించాయి. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్​ను విజయవంతంగా దింపడం ద్వారా.. ఇండియా కూడా వాటి సరసన చేరింది. అంతేకాదు సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకూ ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్​ను విజయవంతంగా చేయలేకపోయింది. ఒక్క ఇండియా మాత్రమే దీనిని చేసి చూపించింది. చంద్రయాన్-3 మిషన్ మొదలైన కొద్ది రోజుల తర్వాత రష్యా తన లూనా 25 మిషన్​ను అకస్మాత్తుగా మొదలుపెట్టి రేసులోకి వచ్చింది. విక్రమ్ కంటే ముందే ల్యాండింగ్​కు సిద్ధమైపోయింది. కానీ చివరిగా చంద్రుడిపై కక్ష్యను తగ్గించేటప్పుడు అది దారితప్పి చంద్రుడిని ఢీకొట్టి ముక్కలై పోయింది.

చంద్రుడిపైకి ఇండియా

మనం సాధించాం. ఎంతో గర్వంగా ఉంది. చంద్రుడిపైకి ఇండియా చేరింది. ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ సహా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డయ్. ఈ క్షణం కోసం అనేక మంది సైంటిస్టులు గత కొన్నేండ్లుగా సరిగ్గా నిద్రపోయి కూడా ఉండరు. వారి కఠోర శ్రమ ఫలించింది. కల నెరవేరింది. ఈ మిషన్​లో వచ్చే 14 రోజులు ఎంతో కీలకం.
- సోమనాథ్​, ఇస్రో చైర్మన్​ 

ఇక సూర్యుడిపై ఫోకస్​

చంద్రయాన్ 3 మిషన్  విజయవంతం కావడంతో జోరు మీదున్న ఇస్రో సైంటిస్టులు ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం సిద్ధం అవుతున్నారు. ఇందు కోసం ‘ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్’ ను పంపనున్నారు. ఈనెల ఆఖరున లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రయోగం చేపట్టవచ్చని సమాచారం. ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్  ఇప్పటికే శ్రీహరికోటలోని రాకెట్  పోర్టులో లాంచింగ్​కు సిద్ధంగా ఉంది. 

దేశవ్యాప్తంగా లైవ్ చూస్తున్న ప్రజలంతా దాదాపు అదే ఉత్కంఠలో ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్ పై విక్రమ్ ముందుకు కదుల్తున్న గ్రాఫ్ క్షణక్షణం ఉత్కంఠను పెంచుతూ ముందుకు కదులుతోంది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) ప్రకారమే ల్యాండర్ తనంతట తానుగా నాలుగు దశల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. మొదట చంద్రుడిపై 30 కిలోమీటర్ల ఎత్తులో రఫ్ బ్రేకింగ్ ను షురూ చేసిన ల్యాండర్.. స్పీడ్ ను, ఎత్తును రఫ్ గా కంట్రోల్ చేసుకుంటూ చంద్రుడి ఉపరితలానికి హారిజాంటల్ (సమాంతరం)గా ప్రయాణిస్తోంది. 

అలా వేగాన్ని, ఎత్తును తగ్గించుకుంటూ 11.5 నిమిషాల్లో 713.5 కిలోమీటర్ల దూరం వెళ్లింది. మొదట్లో 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ల్యాండర్ ఇప్పుడు 7.4 కిలోమీటర్లకు దిగిపోయింది. ఆ తర్వాత అదే ఎత్తులో కొంత సేపు కొనసాగింది. అనంతరం ఫైన్ బ్రేకింగ్ ప్రాసెస్ ను మొదలుపెట్టింది. సమాంతరంగా ఉన్న ల్యాండర్ తనను తాను నిటారుగా మార్చుకుంది. వర్టికల్ డీసెంట్ మోడ్ ను ప్రారంభించి నెమ్మదిగా చంద్రుడి నేలపై దిగిపోయింది. 

దిగే ముందు ల్యాండింగ్ సైట్ లో గుంతలున్నాయా? రాళ్లు, రప్పలు ఉన్నాయా? అన్నది మరోసారి కన్ఫమ్ చేసుకుని మరీ పక్కాగా ల్యాండ్ అయిపోయింది. దీంతో ఇస్రో మాక్స్ లో సైంటిస్టులంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఆనందంతో ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకొన్నారు. 

సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాం: ఇస్రో చీఫ్ ప్రకటన 

దక్షిణ ఆఫ్రికా నుంచి వర్చువల్ గా లైవ్ ను వీక్షిస్తూ ఉత్కంఠతో కనిపించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిషన్ సక్సెస్ కావడంతో సైంటిస్టులతో పాటు ఊపిరి పీల్చుకున్నారు. చేతిలో చిన్న జెండాను పట్టుకుని ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా ల్యాండింగ్ సక్సెస్ అయిన వెంటనే ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘సర్, మనం చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాం. ఇండియా చంద్రుడిపైకి చేరింది” అంటూ సైంటిస్టుల హర్షాతిరేకాల మధ్య ప్రధాని మోదీకి తెలియజేస్తూ ప్రకటన చేశారు. 

ఆ తర్వాత ప్రధాని మోదీ ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ.. తమకు ప్రధాని ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని తెలిపారు. ‘‘ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అద్భుత విజయం సాధించిన ఇస్రో సైంటిస్టులందరికీ గ్రీటింగ్స్ చెప్పారు. చంద్రయాన్-3 వంటి మిషన్ ను సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినందుకు ప్రధానికి ఇస్రో తరఫున థ్యాంక్స్ చెప్తున్నా” అని వెల్లడించారు. ప్రధాని ఫోన్ కాల్ లో మాట్లాడుతున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ‘‘మీ పేరు సోమనాథ్. సోమనాథ్ అంటే చంద్రుడు అని అర్థం. మీకు మీ టీం సభ్యులందరికీ నా తరఫున కంగ్రాట్స్. త్వరలోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి కంగ్రాచులేషన్స్ చెప్తా”అని ప్రధాని చెప్పడం వీడియోలో కనిపించింది.   

ఇక సూర్యుడిపై అధ్యయనం

చంద్రయాన్ 3 మిషన్  విజయవంతం కావడంతో జోరు మీదున్న ఇస్రో సైంటిస్టులు ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం సిద్ధం అవుతున్నారు. ఇందు కోసం ‘ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్’ ను పంపనున్నారు. ఈనెల ఆఖరున లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రయోగం చేపట్టవచ్చని సమాచారం. ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్  ఇప్పటికే శ్రీహరికోటలోని రాకెట్  పోర్టులో లాంచింగ్ కు సిద్ధంగా ఉంది. పీఎస్ఎల్ వీ రాకెట్  సాయంతో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను పంపనున్నారు. సూర్యుడి వాతావరణాన్ని ఇది అధ్యయనం చేస్తుంది.

 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో (ఫస్ట్  లాగ్రేంజ్  పాయింట్, ఎల్1) ఈ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రవేశపెడతారు. ఈ దూరంలో స్పేస్ క్రాఫ్ట్ ను ప్రవేశపెడితే ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై స్పేస్ క్రాఫ్ట్ అధ్యయనం చేస్తుంది. గ్రహణాలు ఏర్పడినా స్పేస్ క్రాఫ్ట్ కు అంతరాయం కలగదు. అలాగే వచ్చే ఏడాదిలో శుక్రగ్రహం వైపు కూడా ఒక ఫ్లైట్ ను పంపుతామని ఇస్రో తెలిపింది.