భద్రాచలం, వెలుగు : సీతారాముల పెళ్లికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకురాకుండా, రూ.100కోట్లు.. రూ.1000కోట్లు అంటూ భద్రాచలం ప్రజలను, రాముడిని మోసగించిన బీఆర్ఎస్ పార్టీని రామభక్తులు ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కాంగ్రెస్ భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. పొదెం వీరయ్య గురువారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలంకు ఏం చేశారని బీఆర్ఎస్ వాళ్లు ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు.
ఓట్లు అడిగే నాయకులు ఏనాడైనా సీఎం దగ్గరకు వెళ్లి నిధులు అడిగి తెచ్చారా అని నిలదీశారు. ఎనిమిదేండ్లుగా భద్రాచలం గోదావరి బ్రిడ్జి నిర్మాణం సాగుతుంటే ఒక్కరైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్న తర సహచరులంతా ఈనెల 30 లోపు కాంగ్రెస్లోకి రావాలని కోరారు. ఆత్మాభిమానం దెబ్బతిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చానని, ఎటువంటి పదవుల కోసం కాదని బాలసాని స్పష్టం చేశారు. వారి వెంట పీసీసీ మెంబర్బుడగం శ్రీనివాసరావు, డీసీఎంఎస్ డైరక్టర్ పరుచూరి రవికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సరెళ్ల నరేశ్, చింతిరేల రవికుమార్పాల్గొన్నారు.
Also Read :-కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ లేదు : కల్వకుంట్ల సంజయ్