అమెరికాలో వరదలు, టోర్నడోలు..16 మంది మృతి

అమెరికాలో వరదలు, టోర్నడోలు..16 మంది మృతి

డైయర్స్ బర్గ్: అమెరికాలోని దక్షిణ, మధ్య రాష్ట్రాల్లో వచ్చిన ఫ్లాష్  ఫ్లడ్స్, టోర్నడోల ధాటికి 16 మంది చనిపోయారు. కెంటకీ, మిస్సిసిస్పి, మిస్సౌరీ, వర్జీనియా,  టెన్నెస్సీలో శుక్ర, శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. వరదల ధాటికి నదులు పొంగిపొర్లాయి. వరదల వల్ల ఒక్క టెనెస్సీలోనే 10 మంది చనిపోయారు. అలాగే, మిస్సౌరీలోని వెస్ట్  ప్లెయిన్స్ లో కూడా వరదలు వచ్చాయి. వరదలకు రోడ్డుపై కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న 57 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు.

కెంటకీలోనూ వరదలకు ఇద్దరు చనిపోయారు. వారిలో 9 ఏండ్ల బాలుడు ఉన్నాడు. అతను స్కూల్ కు వెళ్తుండగా వరద నీటికి కొట్టుకుపోయాడు. వర్జీనియాలోని నెల్సన్  కౌంటీలో శనివారం 74 ఏండ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. వరదలకు వృద్ధుడి కారు మునిగిపోయింది. ఆ సమమయంలో అతను కూడా కారులో ఉండడంతో చనిపోయాడు. అర్కన్సాస్ లోని లిటిల్ రాక్ లో ఓ ఇంట్లో ఐదేండ్ల పిల్లవాడు టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

పలు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భీకర టోర్నడోలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి కారణంగా 521 విమాన సర్వీసులను రద్దు చేశారు. 6,400 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. ఆ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భీకర వర్షాలు కురుస్తాయని నేషనల్  వెదర్ సర్వీస్ అధికారులు హెచ్చరించారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఓహియో నది మట్టం ఐదు అడుగులు పెరిగిందని చెప్పారు. మరికొన్ని రోజుల పాటు ఈ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుందని తెలిపారు.