గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ

గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం తారాస్థాయికి చేరింది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు వాటిని చింపివేయడం.. ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. 

తమపై దాడి చేశారని రేవూరి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గీసుకొండ పోలీసులు ముగ్గురు కొండా అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసిన ఆ ముగ్గురిని విడిచి పెట్టాలని కొండా అనుచరులు ఆదివారం ధర్మారం వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రేవూరి అక్రమంగా కేసులు పెట్టించి తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుగొండ పోలీస్ స్టేషన్ ‌కు చేరుకున్నారు. కార్యకర్తల వివాదంపై సీఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్ కు విచ్చేశారని తెలుసుకున్న కొండా అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దాంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.