బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. గో బ్యాక్ అంటూ నిరసన

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈరోజు(జూన్ 20) నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉండగా.. మా ఊరికి ఏం చేశావ్..? ఎందుకు వస్తావ్..? అంటూ ఫ్లెక్సీల్లో గ్రామస్తులు నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామ ప్రజలు ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు నాయకుడి దగ్గర అడుక్కొకూడదు.. ప్రశ్నలు అడిగి నిలదీయాలి.. అంటూ అయ్యా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అంటూ తమ డిమాండ్లను ఫ్లెక్సీల్లో తెలిపారు.  

డిమాండ్లు

  • రైతులకు రుణమాఫీ ఎక్కడకు పోయే?
  • మా ఊరిలో దళితులు లేరా దళిత బంధు ఎక్కడా?
  • బీసీలు కొన్ని కుటుంబాలేనా? బీసీ బంధు అందరికీ ఎప్పుడు?
  • పేద కుటుంబాలకు నీవు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రోసిడింగ్స్ యాడికి పోయే?
  • మన ఊరు- మన బడి అంటివి పేద పిల్లల ఉసురు పోసుకుంటివి?
  • కొత్త బీడీ పింఛన్లు యాడికి పోయే?
  • కొత్త రేషన్ కార్డులు, కొత్త పేర్లు నమోదు ప్రక్రియ యాడికి పోయే?

అంటూ ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితేనే నాయకులు ఇష్టం వచ్చిన వాగ్ధానాలు చేయరు, ప్రజలను మోసం చేయరు అంటూ ఫ్లెక్సీల్లో నిలదీశారు.