రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్షిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గత ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలానికి ఇచ్చిన పలు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. అయితే ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రసమయికి వ్యతిరకంగా వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.
ఫ్లెక్సీల్లో ఏముందంటే..
మోసం చేసిన దొర.. దగా పడిన జనం.. అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు...
- ఇల్లంతకుంట మండలంలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చావు?
- ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమిని ఇచ్చావు? ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చావు?
- ప్రతి మండలంలోని సర్పంచ్ లు నిధులు లేక ఆత్వహత్యలు చేసుకుంటున్నారో చూడు?
- ఇల్లంతకుంట మండలంలోని డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానన్నవి చేప్పతావా?
- 8 సంవత్సవాలు గడిచాయి.. గుర్తుందా? ఇల్లంతకుంట యువతకు క్రీడా ప్రాంగణం ఇస్తానన్నావు? ..అంటూ ప్రశ్నించారు.
మరో ఫ్లెక్సీలో...
- విప్పల, దాచారం, బోటుమీదపల్లి వరకు సీసీ రోడ్డు వేస్తానని భూమిపూజ చేశావు. ఇంతవరకు దాని జాడేలేదు.
- దాచారం గ్రామంలో ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్స్ లేనే లేవు, కుల సంఘాలను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు కట్టించలేదు.
- బస్ స్టేషన్ కట్టిస్తానని భూమిపూజ చేసి చివరకు దాన్ని కూడా మరిచారు. బస్ స్టేషన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సారు.
- ఇక చాలు Bye. Bye.. అంటూ ఫ్లెక్సీల్లో అగంతకులు కామెంట్లు చేశారు.