హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీవాసుల కష్టాలు ఇంకా ఎన్నిరోజులు అంటూ చెప్పుల దండతో నిరసన తెలియజేశారు. తరచూ పార్టీలు మారే నాయకుల పతనానికి చరమ గీతం ముందు ఉంది అని అందులో పేర్కొన్నారు. మరోవైపు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతల చేరికలపై స్థానిక లీడర్లు ఫైర్అయ్యారు. తమను సంప్రదించకుండా హస్తం కండువా కప్పుకోవడంపై స్థానిక ఎమ్మెల్యే బీఎల్ఆర్, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ సీరియస్ అయ్యారు.
చేరికలకు బ్రేక్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ టి.భార్గవ్ చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ బ్రేక్ వేసింది. ఇవాళ 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో భార్గవ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే ఆయన చేరికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు.