బీఆర్ఎస్ నేతలు రావొద్దంటూ ఖమ్మం జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి. దళిత బంధు ఎంపికలో వివక్ష చూపుతున్నారంటూ.. బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైరా మండలం సిరిపురం గ్రామంలోని రాజుపేట కాలనీకి చెందిన దళితులకు మాత్రమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని.. అదే గ్రామానికి చెందిన మరో రెండు కాలనీలకు ఎందుకు పథకాన్ని ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అధికార పార్టీకి చెందిన వారికి, వారి అనుచరులకు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలపై ఇలాంటి వివక్ష ఎందుకు చూపతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే గ్రామంలో ఉన్న కాలనీలను విడదీసి గ్రామంలో ఉన్న తమ మధ్య చిచ్చు పెడుతున్నారని కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన మూడు కాలనీల్లోకి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులు రావద్దని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
ఫ్లెక్సీల్లో ఏముందంటే..
* బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళితబంధు పథకాన్ని వేదికగా చేసుకొని సిరిపురం కె.జి గ్రామాన్ని 3 ముక్కలుగా విడదిశారు.
* అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైరా శాసన సభ్యులు రాములు నాయక్, వారి వర్గానికి చెందిన నాయకులు అందరూ కలసి అత్యంత రహస్యంగా ఉద్దేశ్యపూర్వకంగా మా సిరిపురం గ్రామాన్ని 3 భాగాలుగా విడతీసే కార్యక్రమంలో భాగంగా దళితబంధు పథకాన్ని వేదికగా చేసుకొని పెట్టిన చిచ్చు కారణంగా దశాబ్ధలుగా ఒకటిగా కలసిఉన్న 1. సిరిపురం కాలనీ, 2. ఇందిరమ్మ కాలనీ, 3. రాజుపేట కాలనీలు
నేడు 3 భాగాలుగా విడిపోయాయి.
* దళత బంధు పథకాన్ని కేవలం రాజుపేట కాలనీ వారికి మాత్రమే అమలు పరచి మిగిలిన రెండు కాలనీలను వెలివేశారు. కాబట్టి ఈరోజు(అక్టోబర్ 08) నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిరిపురం గ్రామ నాయకులు మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు ఏ ఒక్కరు మా 2 కాలనీలకు రావడానికి వీలు లేకుండా ప్రజలంత కలసి బహిష్కరిస్తున్నాము.
* అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తు వెలివేస్తున్నాము. ఇది మా కాలనీల అస్థిత్వము, ఆత్మ గౌరవానికి చెందిన అంశం కనుక ఈ నిర్ణయం.
* ఇట్లు.. సిరిపురం కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రజలు.