బీఆర్ఎస్​ డౌన్ డౌన్.. ఇల్లంతకుంటలో ఫ్లెక్సీ కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్​ పార్టీకి వ్యతిరేకంగా ఓ గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. BRS పార్టీ డౌన్ డౌన్ అంటూ ఫ్లెక్సీలో రాసి ఉంది. ఇల్లంతకుంట మండలంపై చిన్నచూపు చూస్తూ..  దళిత బంధుతో దగా చేస్తున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలో రాసి ఉంది. 

మూడెకరాల మాటలతో మాయ చేస్తూ, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను నిండా ముంచి, పేపర్ లీకులతో, పరీక్ష రద్దు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్న బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లేని రాష్ట్రం బహు బేష్ అంటూ తెలిపారు. ఫ్లెక్సీల విషయం పోలీసుల వరకు చేరడంతో వాటిని తొలగించారు. అయితే.. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు..? అనే దానిపై నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.