- మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో బైఠాయించిన మాజీఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు
- చైర్మన్‌పైకి కుర్చీలు విసిరి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన గులాబీ లీడర్లు
- మాజీఎమ్మెల్యే కంచర్ల సహా, పలువురు లీడర్లు అరెస్ట్
నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలో బీఆర్‌ఎస్ లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫ్లెక్సీల తొలగింపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండలో కేటీఆర్ రైతు మహాధర్నా కార్యక్రమం సందర్భంగా బీఆర్‌ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కానీ కేటీఆర్ కార్యక్రమం వాయిదా పడడం, ఫ్లెక్సీల ఏర్పాటుకు పర్మిషన్ లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ లీడర్లు మంగళవారం మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్‌ఎస్ లీడర్లను వెళ్లిపోవాలని సూచించగా వారితో భూపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం బీఆర్‌ఎస్ లీడర్లు చైర్మన్ ఛాంబర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదే టైంలో ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పైకి లీడర్లు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కంచర్ల భూపాల్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీడర్లు చైర్మన్‌పైకి కుర్చీలు విసరడం, ఆఫీస్‌లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు మాజీఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ లీడర్లను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసినందునే తొలగించాం
కేటీఆర్ కార్యక్రమం సందర్భంగా బీఆర్‌ఎస్ లీడర్లు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే పట్టణంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందువల్లే వాటిని తొలగించాం. నేను ఆఫీస్‌లో లేని టైంలో బీఆర్‌ఎస్ లీడర్లు వచ్చి మున్సిపల్ సిబ్బందిని అసభ్యకరంగా దూషించడంతో పాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశా రు.
ముసాబ్ అహ్మద్, నల్గొండ మున్సిపల్ కమిషనర్