గద్వాల మున్సిపాలిటీపై ఫ్లెక్సీల ఎఫెక్ట్

గద్వాల మున్సిపాలిటీపై  ఫ్లెక్సీల ఎఫెక్ట్
  • లీడర్లకు మద్దతుగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్న అనుచరులు
  • వాటిని తొలగించాలని పోటాపోటీగా ఫిర్యాదులు
  • ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న ఆఫీసర్లు
  • సెలవుపై వెళ్లిన మున్సిపల్  కమిషనర్

గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీలో ఫ్లెక్సీల వార్  చిచ్చు పెడుతోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న ఫ్లెక్సీలను  తొలగిస్తే ఒకరికి కోపం వస్తుండగా, తొలగించకపోతే మరొకరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేక మున్సిపల్​ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు భరించలేక గద్వాల మున్సిపల్  కమిషనర్ రెండు నెలలు సెలవుపై వెళ్లారు. లీడర్ల బర్త్ డే లు, ముఖ్యమైన లీడర్లు వస్తున్నప్పుడు స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ముఖ్య కూడళ్లలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే దర్శనమిస్తుండగా, పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

ఆఫీసర్లపై గుస్సా..

ఇటీవల గద్వాలలో ఇద్దరు లీడర్లకు సంబంధించిన బర్త్ డేలు జరిగాయి. వాళ్లకు విషెస్  తెలిపేందుకు ఇద్దరు లీడర్లకు చెందిన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. వీటిని తొలగిస్తే ఏర్పాటు చేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఎందుకు తొలగించడం లేదని పట్టణ ప్రజలు, వేరే వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది సంబంధిత ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. వాస్తవంగా ఏదైనా మున్సిపాలిటీ, పంచాయతీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పర్మిషన్  తీసుకోవాల్సి ఉంటుంది. 

కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఎవరు పడితే వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గద్వాల పాత బస్టాండ్  దగ్గర ఓ పార్టీ లీడర్  బర్త్ డే వేడుకలకు సంబంధించి కటౌట్  ఏర్పాటు చేశారు. రెండు రోజుల కింద గద్వాలలో కురిసిన వానలు ఈదురుగాలులకు అది కూలి ఓ మహిళపై పడింది. జనసంచారం ఎక్కువగా ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. అలాగే డివైడర్ల మధ్యలో ఉన్న కరెంట్​ పోల్స్​కు ఫ్లెక్సీలు కట్టడం వల్ల పక్క నుంచి వెళ్లే వాహనాలకు తగులుతున్నాయి. 

సెలవుపై కమిషనర్..

గద్వాల మున్సిపల్  కమిషనర్  దశరథం హైదరాబాద్  నుంచి బదిలీపై వచ్చారు. మూడు నెలల పాటు విధులు నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీల వ్యవహారంలో ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని అంటున్నారు. ఫ్లెక్సీలు ఎన్ని రోజులు పెడతారు? వాటిని ఎందుకు తొలగించడం లేదు? ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు పర్మిషన్లు తీసుకున్నారా? తీసుకోకపోతే మీరెందుకు తొలగించడం లేదు? అంటూ ఆయనపై, మున్సిపాలిటీ సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీలు తొలగిస్తే ఒక వర్గానికి కోపం.. తొలగించకపోతే మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ పై ఓ లీడర్  ఫ్లెక్సీ వ్యవహారంలో మండిపడడంతో చేసేది లేక ఆయన మూడు రోజుల కింద రెండు నెలలు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు చర్చ జరుగుతోంది.

ఆదాయం రాకున్నా అదనపు పని..

ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం రాకపోగా, అదనంగా మున్సిపల్  కార్మికులపై పని భారం పడుతుందని అంటున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే ముందు పర్మిషన్  తీసుకుంటే 10, 15 రోజులకు అంటూ నిర్ణీత ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన తరువాత వాటిని ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది. కానీ, ఎలాంటి పర్మిషన్  లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడానికి ట్రాక్టర్లు వాడడంతో పాటు కార్మికులు నిత్యం పని చేయాల్సి వస్తోంది.


సెలవుపై వెళ్లిన మాట వాస్తవమే..

మున్సిపల్  కమిషనర్  సెలవుపై వెళ్లిన మాట వాస్తవమే. ఫ్లెక్సీల వ్యవహారంలో ఆయన సెలవుపై వెళ్లలేదు. వ్యక్తిగత కారణాలతో లాంగ్  లీవ్  పెట్టారు. కమిషనర్ పై ఎవరి ఒత్తిడి లేదు. ఆయనను ఎవరు కూడా కోపగించుకోలేదు.– బీఎస్  కేశవ్, మున్సిపల్  చైర్మన్  గద్వాల