ఎల్ఆర్ఎస్​లో వెసులుబాటు

ఎల్ఆర్ఎస్​లో వెసులుబాటు
  • 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించకున్నా రెగ్యులరైజేషన్
  • ఆ చార్జీలను బిల్డింగ్ పర్మిషన్  టైమ్​లో కట్టుకునే ఆప్షన్ 
  • కాకపోతే అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే చార్జీలు చెల్లించాలనే కండీషన్
  • అప్లికేషన్లలో తప్పులుంటే పోర్టల్​లో గ్రీవెన్స్ రైజ్ చేసుకునే అవకాశం
  • పాత ఓనర్ పేరుతో ఎల్​ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వచ్చినా ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) చార్జీల చెల్లింపులో దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. ప్లాట్లు, లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం రెగ్యులరైజేషన్ చార్జీలు, 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి రెగ్యులరైజేషన్ చార్జీల వరకు చెల్లించినా ప్రొసీడింగ్స్ ఇచ్చే వీలు కల్పించింది. ఈ మేరకు పోర్టల్ లో పేమెంట్ ఆప్షన్ లో మార్పులు చేసింది. 

ఫుల్ అమౌంట్ చెల్లించడమా లేదంటే కేవలం రెగ్యులరైజేషన్ చార్జీల వరకే చెల్లించడమా అనేది దరఖాస్తుదారు ఎంచుకునేందుకు పోర్టల్ లో ఆప్షన్స్ ఇచ్చింది. సర్కార్ కల్పించిన ఈ వెసులుబాటు ఇప్పటికిప్పుడు కొంతమేర ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట ఇవ్వనుంది. 

రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా ఓకే

ప్రొహిబిటెడ్ జాబితాలో లేని ప్లాట్లు, ప్రభుత్వ, శిఖం, వక్ఫ్, దేవాదాయ, ఇతర నిషేధిత జాబితాలోని భూములకు 200 మీటర్ల దూరంలోపు ఎలాంటి వివాదం లేని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో ఇప్పటికే ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయ్యాయి. వీటిలో  రెగ్యులరైజేషన్ చార్జీలు, 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కలిపి మొత్తం ఫీజును పేర్కొనడంతోపాటు 25 శాతం రాయితీ, అప్లికేషన్ ఫీజుగా ఇప్పటికే చెల్లించిన రూ.వెయ్యిని మైనస్ చేసి, చెల్లించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ను పేర్కొన్నారు.

 ఇందులోనూ కేవలం రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా సరిపోతుంది. అయితే మిగతా 14 శాతం ఓపెన్  స్పేస్ చార్జీలు ఇప్పుడు  చెల్లించకపోయినా బిల్డింగ్ నిర్మాణ సమయంలో మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైతే 2020కి ముందునాటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ప్రభుత్వం ఓపెన్ స్పేస్ చార్జీలను విధించిందని, కానీ భవిష్యత్ లో బిల్డింగ్ నిర్మాణ సమయంలో అమలయ్యే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత చార్జీలతో పోలిస్తే భవిష్యత్ లో ఆ మొత్తం చాలా పెరిగే అవకాశముందని చెప్తున్నారు. 

అప్లికేషన్లలో తప్పులుంటే పోర్టల్​లో గ్రీవెన్స్ రైజ్ చేసుకునే అవకాశం

ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసే సమయంలో కొందరు తమ పేర్లు, ఇంటి పేర్లు, రెవెన్యూ విలేజీ పేరు, ప్లాట్ నంబర్, సర్వే నంబర్లను తప్పుగా ఎంట్రీ చేశారు. ఇలాంటి వారు ఎల్ ఆర్ఎస్ పోర్టల్ లో తమ రిజిష్టర్డ్ ఫోన్ నంబర్ తో లాగిన్ అయి గ్రీవెన్స్ రైజ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి తమ సమస్యపై దరఖాస్తు సమర్పించవచ్చు. 

ఆయా మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలోని ఎల్ 1 ఆఫీసర్లు ఈ దరఖాస్తును, ప్రూఫ్ గా అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి సరి చేస్తారు. కొందరు అప్లై చేసిన సమయంలో తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయలేదు. అలాంటి వారికి ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు. వారు కూడా తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఇప్పుడు అప్ లోడ్ చేసుకునే ఆప్షన్ పోర్టల్ లో ఉంది. 

పాత ఓనర్ పేరుతో ప్రొసీడింగ్స్ వచ్చినా నో ప్రాబ్లం

తమ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు 2020లో అప్లై చేసిన ఓనర్లలో కొందరు ఆ తర్వాత వాటిని వేరొకరికి అమ్మేశారు. ఎల్ ఆర్ఎస్ అప్లికేషన్ మాత్రం పాత ఓనర్ పేరిటే చూపిస్తోంది. ఇలాంటివారు తమకు ప్లాట్ అమ్మిన వ్యక్తులను సంప్రదించి వారి నంబర్  ద్వారా ఎల్ ఆర్ఎస్ ఫీజు చెల్లించి ప్రాసెస్ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఓనర్ దగ్గర సేల్ డీడ్ ఉంటుంది కాబట్టి ఫైనల్ ప్రొసిడింగ్ కాపీ పాత ఓనర్ పేరిట వచ్చినా టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదని, ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. 

రెగ్యులరైజేషన్ తో ప్లాట్ వాల్యూ పెరుగుతది

ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లకు, లేని ప్లాట్లకు డిమాండ్, వాల్యూలో చాలా ఉంటుంది. ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లను ఎవరైనా  కొనేందుకు ముందుకొస్తారు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీని ప్రజలు వినియోగించుకోవాలి. రెగ్యులరైజేషన్, 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లిస్తే బిల్డింగ్ నిర్మాణ పర్మిషన్ చాలా ఈజీ అవుతుంది. మున్సిపల్ పర్మిషన్ ఫీజు తప్ప ఇతర చార్జీలేవీ ఉండవు. అలాగే గతంలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 10 శాతం ప్లాట్లు అమ్మేసి.. మిగతా ప్లాట్లను గత సర్కార్ నిబంధనల వల్ల అమ్ముకోలేకపోయిన వ్యక్తులు ఇప్పుడు మిగతా ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.     

- కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్ -