మోదీ పర్యటన సందర్భంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వరంగల్ మోదీ పర్యటనను నిరసిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వరంగల్ కు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు మార్గంలోనే వెళ్లాలని పీర్జాదిగూడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. మోదీ సర్.. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందంటూ స్థానికులు పోస్టర్లలో ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఫ్లెక్సీల్లో ఏముందంటే..
మోదీ గారు...? వరంగల్ సభకు ఉప్పల్ ఎలివెటేడ్ కారిడార్ రోడ్డు మార్గంలోనే వెళ్ళాలని ఉప్పల్- పీర్జాదిగూడ ప్రజల డిమాండ్! అని పోస్టర్లలో డిమాండ్ చేశారు.
- 5 ఏండ్ల కింద శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎలివెటేడ్ కారిడార్ పనుల పురోగతిని చూడాలి.
- బీజేపీ నాయకులు అందరూ ఈ రోడ్డు మార్గంలోనే వరంగల్ సభకు వెళ్ళాలి.
- 5 ఏండ్లు అయినా పూర్తికాని ఉప్పల్- నారపల్లి ప్లైఓవర్ అని ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీని నిలదీశారు.