సర్కారుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. పసుపుబోర్డ్​ ఫ్లెక్సీలకు కౌంటర్​

  •     నిజామాబాద్​  లోక్​సభ పరిధిలో హల్​చల్​  

నెట్​వర్క్​ , వెలుగు: నెరవేరని  రాష్ట్ర ప్రభుత్వ  హామీలపై వ్యంగ్యాస్తాలు సంధిస్తూ నిజామాబాద్​ పార్లమెంట్ ​నియోజకవర్గ పరిధిలో   శనివారం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్​ తల నరుక్కుంటడు గానీ ఇచ్చిన మాట   తప్పడు  అంటూ చురకలంటించారు. శుక్రవారం నిజామాబాద్​లో పసుపుబోర్డు అంశంపై ఎంపీ ఆర్వింద్​పై సెటైరికల్​గా వేసిన ఫ్లెక్సీలకు కౌంటర్​గా వీటిని  ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. నిజామాబాద్​తో పాటు ఆర్మూర్, నందిపేట, మెట్​ పల్లి, జగిత్యాలలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 

‘ఇదిగో నిరుద్యోగ భృతి .. నెలకు రూ. 3,016’ అని సుభాష్​నగర్​లోని అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్త క్యాంపు ఆఫీసుకు ఫ్లెక్సీ కట్టారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర స్కీమ్​లపై   ఫ్లెక్సీలు వెలిశాయి.  నందిపేటలో  రైతులందరికీ ఉచిత ఎరువులు ఇదిగోఅంటూ ఫ్లెక్సీ పెట్టారు.  ఆర్మూరులో కల్వకుంట్ల కవితకు బుర్జు ఖాలిఫాలో ప్లాట్లు..   ఎమ్మెల్యే  జీవన్ రెడ్డికి  జీవన్ మాల్ ​ఉన్నాయి కాని పేదలకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఏవీ అంటూ ప్రశ్నించారు.  మెట్ పల్లి  పాత బస్టాండ్, ఆర్టీసి డిపో ప్రాంతాల్లోనూ. జగిత్యాల టౌన్​లోనూ  ఫ్లెక్సీలు వెలిశాయి.  

అధికారంలోకి వచ్చిన  వంద రోజుల్లో  నిజాం షుగర్ ఫ్యాక్టరీని  ప్రభుత్వ పరంగా నడిపిస్తామన్న   కేసీఆర్ హామీపై నిలదీశారు.   'నిరుపేదలకు కేసీఆర్ ఇచ్చిన 120 గజాల డబుల్ బెడ్ రూం ఇండ్లు’    '500 కోట్లతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ   సెల్’  ఇదేనంటూ ఫ్లెక్సీల్లో  పేర్కొన్నారు.   శనివారం   ఎమ్మెల్సీ కవిత జగిత్యాల  లో   బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి రానుండడంతో    బీఆర్ఎస్ నాయకులు వాటిని  తొలగించారు.