దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం క్రికెట్ ఫీవరే నడుస్తుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఫైనల్ క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. 12 ఏళ్ళ తర్వాత టీమిండియా ఫైనల్ కు చేరుకోవడం.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఫైనల్ అభిమానులకి కిక్ ఇస్తుంది. మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు అభిమానులు పరుగులు పెడుతున్నారు. అయితే అహ్మదాబాద్ చేరుకోవడానికి విమాన చార్జీలు భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ కప్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని విమాన చార్జీలు అమాంతం పెంచేశారు.
బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కి వన్‌వే విమానానికి రూ.33,000. ఈ ధరను చూస్తే వామ్మో అనిపించినా.. ఇదే నిజం. భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవడంతో బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు విమాన చార్జీలు భారీగా పెరిగాయి. సాధారణ బెంగళూరు-అహ్మదాబాద్ వన్-వే ఛార్జీలు రూ. 5,700 నుండి ప్రారంభం కాగా, గురువారం సాయంత్రం నాటికి, అదే సెక్టార్‌కి నవంబర్ 18 (శనివారం) వన్-వే టిక్కెట్ రూ. 33,000గా ఉంది.
బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA) నుండి అహ్మదాబాద్‌కి ఉదయాన్నే బయలుదేరే ఛార్జీలు కూడా రూ. 30,999 నుండి ప్రారంభమవుతాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ స్టార్ట్ అవుతుంది. విమాన చార్జీలతో పాటు అహ్మదాబాద్ హోటల్ రేట్ కూడా భారీగా పెంచేశారు. ఒక్క రాత్రికి ఇక్కడ బస చేయాలంటే లక్ష 25 వేలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో క్రికెట్ ఫీవర్ క్రేజ్ ఎంతలా ఉందో ఈ చార్జీలు బట్టి అర్ధం అవుతుంది.
టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించగా ఆస్ట్రేలియా జట్టు నేడు వెళ్తుంది. 20 ఏళ్ళ తరవాత ఆస్ట్రేలియా, భారత జట్లు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ ఫైనల్లో భారత్ 125 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ ఈ సారి ఫామ్ లో ఉన్న టీమిండియా ఆసీస్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.