మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

  • సింగరేణి ఆధ్వర్యంలో 200 మెగావాట్ల ప్రాజెక్టు
  • రూ.1800 కోట్లతో రెండేండ్లలో పూర్తిచేసేలా ప్రణాళిక
  • ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి  
  • సీఎం నుంచి  గ్రీన్​సిగ్నల్ రాగానే  ప్రారంభంకానున్న పనులు

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్  రిజర్వాయర్ లో భారీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆదేశాలతో రెండేండ్లలో 200 మెగావాట్ల ప్లాంట్​ను సింగరేణి సంస్థ రూ. 1800 కోట్లతో నిర్మించబోతోంది. ఈమేరకు ప్రాథమిక సర్వే పూర్తిచేసిన ఆఫీసర్లు ప్రతిపాదనలు రెడీ చేసి కేసీఆర్​పరిశీలనకు పంపించారు. వారం, పది రోజుల్లో గ్రీన్​సిగ్నల్​రాగానే పనులు ప్రారంభించనున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఎలాంటి వాగులేని చోట 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ లో నీటి ఆవిరికి అవకాశాలు ఎక్కువ. ఈ ఆవిరి..నష్టాన్ని తగ్గించడంతో పాటు సోలార్​ పవర్​ ప్లాంట్​కు అన్నివిధాలా అనువుగా ఉన్నందునే మల్లన్నసాగర్​ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

100 ఎకరాల విస్తీర్ణంలో..

కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద జలాశయమైన మల్లన్న సాగర్ ను 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడంతో  ఫ్లోటింగ్(తేలియాడే పలకల) సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది.18 వేల ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ ఉండగా, వంద ఎకరాల్లో మొదటి దశ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వంద మెగావాట్ల చొప్పున రెండు దశల్లో రెండేండ్లలో పూర్తి స్థాయిలో ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మించాలని ప్లాన్​చేస్తున్నారు. 

వంద మెగావాట్లకు రూ.900 కోట్లు

రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కోసం సింగరేణి దాదాపు రూ.1800 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. మొదటి ఏడాదిలో వంద మెగావాట్ల కోసం రూ.900 కోట్లు వెచ్చించనున్నది. ఇప్పటికే సింగరేణి అధికారులు సర్వే చేసి ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని గుర్తించారు. మొదటి విడతలో పంప్ హౌజ్ కు సమీపంలోని వంద ఎకరాల్లో 100 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.  

సర్వే పనుల్లో గోప్యత

ప్లాంట్ ఏర్పాటుకు చేస్తున్న సర్వే పనుల విషయంలో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. లోయర్ మానేర్ డ్యామ్ లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా సర్వే చేయగా సమీప గ్రామాల మత్స్య కారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని సీక్రెట్​గా సర్వే చేస్తున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల మత్స్యకారులకు ఇక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వారి నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది. రిజర్వాయర్ లో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ  ఏడాది  మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.