- ఆకస్మిక వర్షాలతో వాలెన్సియా అతలాకుతలం
- వరదల్లో కొట్టుకుపోయిన మనుషులు, వాహనాలు
మాడ్రిడ్: స్పెయిన్లో వరద బీభత్సం సృష్టించింది. మలగా నుంచి వాలెన్సియా వరకు దక్షిణ, తూర్పు స్పెయిన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. హఠాత్తుగా వచ్చిన వరదలతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. నదులన్నీ పొంగి వీధులను ముంచెత్తాయి. రైల్వే లైన్స్, రోడ్లన్నీ నీటమునిగాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది.
ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది చెట్లు ఎక్కారు. అలాగే, ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. ఇప్పటివరకూ వరదల్లో కొట్టుకొనిపోయి 63 మంది మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు. మరికొంతమంది ఆచూకీ లభించడం లేదు.
వరదల్లో ఓమహిళతోపాటు కార్లు కొట్టుకుపోయే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. వాలెన్సియా ప్రాంతంలో రాష్ట్ర వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పాఠశాలలు, క్రీడా కార్యక్రమాలను నిలిపేశారు. 12 విమానాలను దారి మళ్లించగా.. 10 విమానాలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, వరదల్లో 63 మంది చనిపోవడంపై స్పెయిన్ప్రధాని పెడ్రో శాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.