- నాలుగు బస్సుల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం
- మరో మార్గంలో ఆదిలాబాద్‌కు తరలింపు
నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలకు వాగులు వంకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి వరదల పోటెత్తడంతో ఆదిలాబాద్ మండలంలోని బంగారు గూడా ‘అనుకుంటా’ వాగు ఉప్పొంగింది. నీళ్లు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బంగారుగూడలోని ఆదర్శ పాఠశాలలో స్టూడెంట్లు, టీచర్లు బడిలోనే చిక్కుకున్నారు. ప్రతి రోజు ఆదిలాబాద్ నుంచి స్టూడెంట్లు బంగారుగూడ స్కూల్ కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం స్కూల్ టైం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లాల్సిన దాదాపు 400 మంది స్టూడెంట్లు, 25 మంది టీచర్లు.. వాగు ఉప్పొంగుతోందని తెలిసి స్కూల్లోనే ఉండిపోయారు. అందరికీ బడిలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల వరకు వాగు ఉధృతి తగ్గకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తమ పిల్లలు ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్.. స్కూల్లో చిక్కుకుపోయిన వారందరినీ ఆదిలాబాద్ తరలించేందుకు నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయించారు. రాత్రి 11 గంటలకు సమయంలో మరో రూట్లో బేల మండలం మీదుగా ఆదిలాబాద్‌కు సేఫ్ గా తరలించారు. అక్కడి నుంచి స్టూడెంట్లను సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు.
గోదారి ఉగ్రరూపం
ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి జిల్లాల్లో దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు, విపత్తు దళాల సాయంతో లంక గ్రామాలకు ఆహార పదార్థాలు చేరవేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు