తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ మొదలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు పోరాటాల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది.. ఈ క్రమంలో శనివారం ( సెప్టెంబర్ 7, 2024 ) కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. నెల్లికుదురు మండలం లో భారీగా కురిసిన వర్షానికి రావిరాల గ్రామం లో హైలైవల్ బ్రిడ్జి పైనుంచి ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.
హైలెవెల్ బ్రిడ్జిపై వరద కారణంగా మహబూబాబాద్ నెల్లికుదరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ పట్టణంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శనివారం ( సెప్టెంబర్ 7, 2024 ) రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై, ఇండ్లలో వరద నీరు నిలిచింది.
మహబూబాబాద్ బందం చెరవు సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది.
మహబూబాబాద్, కురవి కి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర మైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని పోలీసులు సూచిస్తున్నారు.