హైదరాబాద్లో కుండపోత

హైదరాబాద్లో కుండపోత
  •  గ్రేటర్ ​వ్యాప్తంగా దంచికొట్టిన వాన   
  • ఇయ్యాల, రేపు ఎల్లో అలర్ట్​

గ్రేటర్ ​వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చినుకులతో మొదలై భారీ వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అత్యధికంగా కృష్ణానగర్ ఏరియాలో 9.33 సెంటీ మీటర్ల వాన పడింది. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపుల్లోకి వరద నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–11 ఉదయ్ నగర్ కాలనీలోని నాలా పైకప్పుతోపాటు రిటైనింగ్ వాల్ వరద నీటికి కొట్టుకుపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఆ ప్రాంతాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరక్టర్ ప్రకాశ్​రెడ్డిలు పరిశీలించారు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ప్రెజర్ తట్టుకోలేక కప్పు కూలినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఖైరతాబాద్​లో మూడు కార్లు నీటిమునిగాయి. ఫ్లైఓవర్లపై మోకాలులోతున నీరు నిలిచింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్15లో చెట్టు కూలి, ఆటో, టూవీలర్ ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేసేందుకు గంటల తరబడి సమయం పట్టింది. ఉద్యోగులు ఇంటికెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు తప్పలేదు.

భారీ వర్షానికి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లోని రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు చేరింది. వర్షంతోపాటు క్రికెట్ మ్యాచ్ ఉండడంతో ఉప్పల్ ​పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్​కు దాదాపు 150 ఫిర్యాదులు అందాయి. ఈవీడీఎం హెల్ప్ లైన్ నంబర్​కు 82 ఫిర్యాదులు వచ్చాయి. నీలోఫర్ హాస్పిటల్ పాత భవనంలో ఫాల్ ​సీలింగ్ కూలింది. 

ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు. శివారు ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లో అలర్ట్​ ప్రకటించారు. 

– సిటీ నెట్​వర్క్, వెలుగు