- జూరాల, తుంగభద్ర నుంచి ప్రవాహం
- ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి లక్షన్నర క్యూసెక్కులు రిలీజ్
- జూరాలకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- గోదావరి నుంచి 12 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి రాష్ట్రంలో మోస్తరు వానలు..
- మరో రెండు రోజులు తేలికపాటి వర్షం
హైదరాబాద్, వెలుగు : ఎగువ నుంచి వరద కంటిన్యూ అవుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. లక్షన్నర క్యూసెక్కులకుపైగా వచ్చి చేరుతున్నది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,51,481 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 63.81 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిన్న మొన్నటిదాకా సాగర్ ప్రాజెక్టుకు తాగునీటి కోసం 9500 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి విడుదల చేయగా.. తాజాగా నిలిపేశారు. ఆల్మట్టి, నారాయణపూర్జలాశయాలకు లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే స్థాయిలో కిందకు విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో వరుసగా 95.5, 32.18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టులో మరో 34.22 టీఎంసీలు ఖాళీ ఉంది.
నారాయణపూర్‌కు మరో 5 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండనుంది. జూరాల ప్రాజెక్టుకు 1,65,000 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,51,790 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 9.66 టీఎంసీలకు ప్రస్తుతం 7.76 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్టుకూ వరద వస్తున్నది. నిన్నటి దాకా లక్ష క్యూసెక్కులకుపైగా వరద రాగా.. ఇప్పుడు 85,148 క్యూసెక్కులకు తగ్గింది. 105.79 టీఎంసీలకు 93.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు జూరాల, అటు తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకు గాను 63.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రోజూ సగటున 10 టీఎంసీల చొప్పున నీళ్లు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీలకు గాను 120.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గోదావరి వరద వచ్చింది వచ్చినట్టు కిందికే..
గోదావరి నది నుంచి లక్షల క్యూసెక్కులు సముద్రంలోకే వెళ్లిపోతున్నాయి. గోదావరి నదిలోకి వచ్చిన వరద వచ్చినట్టు కిందకు వదిలేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీకి 7,71,580 క్యూసెక్కుల వరద వస్తుండగా..అంతే మొత్తాన్ని కిందకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం వద్దనున్న సమ్మక్కసాగర్ బ్యారేజీకి 9,36,570 క్యూసెక్కుల వరద వస్తోంది. దీన్నంతా దిగువకు వదులుతున్నారు. దుమ్ముగూడెం సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు 12,88,481 క్యూసెక్కుల వరద వస్తున్నది. అంతే మొత్తం కిందకు వెళ్లిపోతున్నది.
భద్రాచలం వద్ద 48.35 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. 12,00,642 క్యూసెక్కుల వరద సముద్రంలోకి వెళ్తున్నది. కాగా, గోదావరి నదిపై ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు స్వల్ప వరద కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 25,490 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 11,229 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీరాంసాగర్‌లో 80.500 టీఎంసీలకు గాను 23.31 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీలకు 12.13 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 7.6 టీఎంసీలకుగానూ 5.62 టీఎంసీలున్నాయి. సింగూరులో 29.917 టీఎంసీలకు గాను 13.75 టీఎంసీలునిల్వ ఉండగా.. నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు 3.30 టీఎంసీల నీళ్లున్నాయి.
రాష్ట్రంలో మోస్తరు వానలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. నిన్నమొన్నటిదాకా భారీ వర్షాలు కురవగా.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రమంతా ముసురు పట్టింది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా కౌటాలలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా బెజ్జూరులో 3.1, రవీంద్రనగర్‌లో 3.1, లోనవెల్లిలో 3.1, నల్గొండ జిల్లా చిట్యాల ఉరుమడ్ల రోడ్లో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దాని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది.