ప్రజా దర్బార్​లో ఫిర్యాదుల వెల్లువ

ప్రజా దర్బార్​లో ఫిర్యాదుల వెల్లువ

తూప్రాన్, వెలుగు:  కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బర్ లో పట్టణానికి చెందిన కమ్మరి శ్రీనివాసాచారి గజ్వేల్ లో బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలపై ఫైల్ తయారుచేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా జరిగిన అవినీతిని, అక్రమాలను, దౌర్జన్యాలను, భూ కబ్జాలను వివరించే గజ్వేల్ ఫైల్స్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశానన్నారు. మాజీ సీఎం కేసీఆర్​మంచి ఉద్యమకారుడే కానీ మంచి పరిపాలన దక్షుడు కాదని అభిప్రాయపడ్డారు.  

భూమి కబ్జా చేశాడని ఫిర్యాదు

శివ్వంపేట: ప్రజాదర్భార్​లో మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లికి చెందిన రైతు శివ్వయ్య ముఖ్యమంత్రికి తన ఫిర్యాదును అందజేశారు. మంత్రి సీతక్కను కలిసి తమ భూమిని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, పీఏసీఎస్​ చైర్మన్  వెంకట్రాంరెడ్డి  కబ్జా చేశాడని ఆరోపించారు. ఈ విషయమై స్పందించిన సీతక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని శివ్వయ్య తెలిపారు.     

క్రషింగ్ యాజమాన్యాలపై ఫిర్యాదు

సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని  కంది మండలం ఎర్ధనూర్ గ్రామంలో పేదల భూములు ఆక్రమించుకున్న క్రషర్, మైనింగ్ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం ప్రజాదర్బార్​లో భాగంగా మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి నిరుపేద రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారిలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొత్తగుళ్ల మల్లేశ్ యాదవ్, రాములు, ప్రవీణ్, లింగదాస్ ఉన్నారు.