అశ్వాపురం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్టపై అకస్మాత్తుగా వరద పెరిగింది. దీంతో సీతమ్మ సాగర్ వంతెన పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పనుల వద్ద కాపర్ వంతెన కోతకు గురైంది. దీంతో వంతెనపై గురు, శుక్రవారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో మాత్రమే దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి వరద పొంగి ప్రవహిస్తుంది.
వేసవిలో ఈ ఆనకట్ట అశ్వాపురం –దుమ్ముగూడెం మండలాల రవాణాకు వారధిగా ఉంటుంది. రెండు రోజులు కింద ఎగువన ఉన్న సమ్మక్క సారక్క ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆనకట్టపై నుంచి వరద పొంగిపొర్లడంతో దిగువన సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల వద్ద కాపర్ వంతెన కోతకు గురైంది. ఏడు అడుగుల వరకు గోదావరి వరద ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు.