ఎన్నికలకు ముందు అప్లై చేసుకున్నోళ్లకే వరద సాయం
గ్రేటర్ లో ఎంక్వైరీ లేదు.. వరద బాధితుల గుర్తింపూ లేదు
లక్షల్లో బాధితులు.. వేల మందికే సాయం
రెవెన్యూ వాళ్లు చూస్తున్రు:బల్దియా
తమకేమీ తెల్వదంటున్న రెవెన్యూ అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం నామ్కే వాస్తేగా మారిపోయింది. బాధితులను గుర్తించి సాయం అందిస్తామన్న సర్కార్ మాటలు అమలు కావడం లేదు. బాధితులను గుర్తించి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని మూడ్రోజులుగా బల్దియా అధికారులు చెప్తున్నా.. ఎక్కడా బాధితుల గుర్తింపు చేపట్టినట్లు కనిపించడం లేదు. కేవలం సీఎం హామీని నెరవేర్చారని చెప్పేందుకే.. గతంలో వచ్చిన అప్లికేషన్లలోనే కొందరికి రూ.10 వేలను అకౌంట్లలో వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా సికింద్రాబాద్, ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లలో కొన్ని కాలనీల్లోని వారికే డబ్బులు వేస్తున్నట్లు సమాచారం. అయితే రెవెన్యూ అధికారులను వరద బాధితులను గుర్తిస్తున్నారని జీహెచ్ఎంసీ చెప్తుండగా.. తమకేమీ తెల్వదని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
సీఎం మాట కోసమేనా?
గ్రేటర్ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ఇచ్చిన మాట కోసమే వరదసాయం అందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాధితులను ఎలా గుర్తిస్తున్నారో అధికారులు చెప్పడంలేదు. మూడ్రోజులుగా 28,436 మందికి రూ.28.44 కోట్లు అందించినట్లు వెల్లడించింది. అయితే లక్షల్లో బాధితులుంటే వరదసాయం మాత్రం వేలల్లోనే అందుతోంది. మరోవైపు వరదసాయం కోసం మీసేవా సెంటర్లకు వెళ్లొద్దని, ఇంటికొచ్చి వరద బాధితులను గుర్తించి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించడంతో బాధితులు ఇంటి వద్దే ఎదురు చూస్తున్నారు.
మరికొద్ది రోజులే?
జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం అందని బాధితులు ఇంకా లక్షల మంది ఉన్నారు. ఎలక్షన్ కు ముందు 6 లక్షల మంది మీసేవలో అప్లై చేసుకున్నారు. వారిలో రెండున్నర లక్షల మందికి రెండ్రోజుల్లోనే రూ. 10 వేల చొప్పున పడ్డాయి. ఇప్పుడు మూడు రోజుల్లో 28 వేల మందికే డబ్బులు వేసింది. మరికొద్ది రోజులు ఇలాగే ఖాతాల్లో వేసి, ఆ తర్వాత అందరికీ అందించామని వరదసాయం నిలిపివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.
నోరు విప్పని ఆఫీసర్లు
వరద బాధితులను ఎలా గుర్తిస్తున్నారన్న విషయంపై బల్దియా అధికారులు నోరు విప్పడం లేదు. ఈ నెల 7 నుంచి ఎల్బీ నగర్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలోని ముంపు ప్రాంతాల్లో మీసేవలో అప్లై చేసుకున్నవాళ్లలో కొందరికే వరద సాయం డబ్బులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బల్దియా అధికారులు స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారు. సికింద్రాబాద్లోని ఓ అధికారిని అడిగితే తమకేమి తెలియదని, అంతా రెవెన్యూ వాళ్లు చూసుకుంటున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులను అడిగితే వరద బాధితులను గుర్తించడంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.
మరోవైపు వరద సాయం కోసం మీసేవ సెంటర్లలో అప్లై చేసుకున్న బాధితులకు డబ్బులు ఇంకా రాకపోవడంతో మీసేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. . ఇప్పటికీ ఒక్కో మీసేవ సెంటర్ కు రోజూ 200 మంది వరకు అప్లై చేసుకునేందుకు వస్తున్నారు.
ఎన్నికలు అయ్యాక ఇస్తలేరు
జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే వరద సాయం డబ్బులు ఇస్తమన్నరు. కానీ ఇవ్వడంలేదు. ఓట్లు అడిగేందుకు వచ్చిన లీడర్లు ఇప్పుడు రావడంలేదు. అందరికీ బ్యాంక్ ఖాతాలో పైసలు వేస్తామని సర్కార్ చెప్పింది. కానీ మాకు సాయం అందలేదు. – కాజల్దేవి, శ్రీనివాస నగర్
సర్కార్ నుంచి ఆదేశాల్లేవ్
ముంపు ప్రాంతాలలో ఎంక్వైరీ కోసం మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. మేం ఏమీ చేయలేం. మాకు సర్కార్ నుంచి ఆదేశాలు వస్తే.. సాయం ఎవరికి అందిది? ఎవరికి అందలేదన్నది ఎంక్వైరీ చేస్తాం. డబ్బులు అందనోళ్లకు పంపిణీ చేస్తాం.– మారుతి దివాకర్, డిప్యూటీ కమిషనర్, హయత్ నగర్ సర్కిల్.