ఎన్నికల తర్వాత వరద సాయం డౌటే

కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్​ అతలాకుతలమైంది. చాలా కాలనీలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ఉండేందుకు గూడు లేక, తినడానికి తిండి కూడా లేక జనం నానా అవస్థలు పడ్డారు. తూతూ మంత్రంగా సహాయ చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. దుబ్బాక ఎన్నికలో రూలింగ్​ పార్టీకి షాక్​ తగలడంతో వెంటనే గ్రేటర్​ ఎన్నికలు పెట్టేయాలని డిసైడ్​ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్​ రావడానికి కొద్ది రోజుల ముందు వరద బాధితులకు రూ.10 వేల సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయం కొంత మందికి చేరినా.. నిజమైన లబ్ధిదారులకు పూర్తిగా చేరలేదు. ఈ లోపు ఎన్నికల కోడ్​ అమలులోకి రావడంతో వరద సాయాన్ని సర్కారు నిలిపేసింది. ఎలక్షన్​ కోడ్​ కారణంగా ఆపేసిన వరద సాయాన్ని పోలింగ్​ పూర్తయిన తర్వాతైనా ప్రభుత్వం ఇస్తుందా? లేదంటే తోకముడిచి.. జనాన్ని నట్టేట ముంచేస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

ఇప్పటికీ తేరుకోని సిటీ జనం

హైదరాబాద్​ను వరదలు ముంచెత్తుతాయని ఎవరూ అనుకోలేదు. సిటీలో డ్రైనేజీ సిస్టం సక్రమంగా లేదని ఎక్స్​పర్ట్స్​ చెపుతున్నా పాలకులు పట్టించుకోలేదు. హైదరాబాద్​కు వరదలు వస్తాయా? వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ వారి సూచనలను పక్కనపెట్టేశారు. కానీ కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్​ మొత్తం అతలాకుతలమైంది. అసలు ఏం జరుగుతోందో ప్రభుత్వానికే అర్థం కాలేదు. అధికారులను, డిజాస్టర్ టీమ్స్ ను, బోట్లను రంగంలోకి దించి తాత్కాలిక చర్యలు చేపట్టింది. కానీ, పరిస్థితి కంట్రోల్​ లోకి రాకపోవడంతో పూర్తిగా చేతులెత్తేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా డివిజన్లు ఇప్పటికీ ముంపు ప్రభావం నుంచి తేరుకోలేదు. మురుగునీరు నిలిచిపోయి.. వరదల్లో అన్నీ కోల్పోయి జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు.

పది వేల సాయంతో పరేషాన్

వరదల్లో అన్నీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత కొంత మంది బ్యాంక్​ అకౌంట్లలోకి ఈ మొత్తం చేరింది. కానీ, మిగతా బాధితులందరికీ పూర్తి రిలీఫ్​ దక్కలేదు. అయితే ఇదే సమయంలో రూలింగ్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులోకి ఎంటర్​ అయ్యారు. అధికారులను పక్కన పెట్టేసి తామే నేరుగా క్యాష్​ రూపంలో సాయం అందజేశారు. ఇందులో కొంత మొత్తాన్ని మళ్లీ వారే తీసుకున్నారనే ఆరోపణలు చాలా చోట్ల వచ్చాయి. కానీ అధికారులు అందించాల్సిన సాయాన్ని అధికార పార్టీ నేతలు ఎలా ఇస్తారు. దీని గురించి పట్టించుకునే వాళ్లే లేరు. ఈ వరద సాయాన్ని రూలింగ్​ పార్టీ లీడర్లు గ్రేటర్​ ఎన్నికల తాయిలంగా వాడుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సాయానికి ఎవరూ లెక్కలు అడగరు. ఒకవేళ అడిగినా వాటికి లెక్కలు ఉండవు.

కోడ్​ పేరిట సాయానికి బ్రేక్

గ్రేటర్​ ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. ఎన్నికల తేదీలు ఖరారవ్వగానే మిగతా వారికి వరద సాయం అందిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మీ సేవ సెంటర్ల ముందు భారీ క్యూలు కనిపించాయి. తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వరద బాధితులు క్యూ కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల పాటు మీ సేవ సెంటర్ల ముందు ఎక్కడ చూసినా భారీ క్యూలే కనిపించాయి. ఎన్నికల కోడ్​ అమలులో ఉండగానే కొంత మందికి సాయం అందజేశారు. కానీ ఆ తర్వాత కోడ్​ పేరు చెప్పి మొత్తం వరద సాయాన్ని నిలిపేశారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది బాధితులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సాయాన్ని ప్రభుత్వమే అడ్డుకుందా?

మరోవైపు వరద సాయం అందకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని రూలింగ్​ పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారని లెటర్లను రిలీజ్​ చేసింది. వారి వల్లే వరద సాయం ఆగిపోయిందని అంటోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వమే కావాలని ఒక పథకం ప్రకారం సాయాన్ని ఆపేసిందా అనే అనుమానం వస్తోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్​ కూడా వరద బాధితులకు భారీగా సాయాన్ని ప్రకటించాయి. వరద సాయంగా రూ.20 వేలు ఇస్తామని, ట్రాఫిక్​ చలాన్లను తామే కడతామని బీజేపీ హామీలు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్​ రాజకీయాలు హాట్​హాట్​గా మారాయి.  ఇప్పటి వరకూ ఉన్న పాలకులు సిటీకి ఒరగబెట్టింది ఏమీ లేదు.. ఫొటోస్​ తప్ప. చైతన్యవంతులైన హైదరాబాద్​ జనం ఆలోచించి ఓటు వేసి మార్పునకు నాంది పలుకుతారా? అనేది వేచిచూడాలి.

రైతు బంధులా ఎందుకు కొనసాగించలేదు

మొన్నటి జనరల్ ఎలక్షన్ల సమయంలో ‘రైతు బంధు’ ఎన్నికల ముందే నిర్ణయించిన పాలసీ కాబట్టి యథేచ్ఛగా కొనసాగించొచ్చని చెప్పిన ప్రభుత్వం.. జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ముందే వరద సాయం ప్రకటించినప్పుడు దానిని ఎందుకు నిలిపేసింది. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసిందా? దుబ్బాక ఓటమిని ప్రజలు మరచిపోవాలని హడావుడిగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని తొందరపడిందా? వరద సాయం విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేసింది? ఎన్నికల కోడ్ వల్ల సాయం ఆపేశామంటున్న ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తయిన తర్వాతైనా సాయం అందిస్తుందా? రైతుబంధు, వరద సాయం రెండూ ప్రభుత్వ నిర్ణయాలే. రెండూ అమలు చేసేటప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ముందే తెచ్చిన రైతుబంధుకు కోడ్ అడ్డురానప్పుడు.. వరద సాయానికి మాత్రం ఎందుకు అడ్డువచ్చింది? ఎన్నికల తర్వాతైనా అందజేస్తారా? లేక ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

-రచనారెడ్డి, అడ్వొకేట్