సాయం ఇలా చేస్తారా..? : బెజవాడ రోడ్లపై చెత్త కుప్పల్లో వరద బాధితుల ఆహార పొట్లాలు

సాయం చేయాలంటే అది కడుపు నింపే విధంగా ఉండాలి.. ఒకరి ఆకలి తీర్చాలి.. కష్టంలో ఆదుకున్నాం అనే భావనతో చేయాలి.. లేకపోతే చేయొద్దు.. మీ వల్ల కాదంటే వదిలేయండి.. అంతేకానీ ఫొటోలు, వీడియోల కోసం.. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఆహార పొట్లాలతో షూటింగ్స్ చేసి.. వాటిని రోడ్లపై పడేసి మాత్రం వెళ్లకండి.. ఇదంతా ఎందుకు అంటారా.. ఏపీలో వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలుగా.. కుప్పలుగా ఆహార పొట్లాలు పడి ఉన్నాయి. ఎవరు తెచ్చారో.. ఎందు కోసం తెచ్చారు ఏమో తెలియదు.. అలా తెచ్చిన ఆహార పొట్లాలు బాధితులకు అందించకుండా.. బాధితుల ఆకలి తీర్చకుండా రోడ్ల పక్కన చెత్త కుప్పగా పడి ఉన్నాయి. 

ఓ వైపు ఆహారం కోసం మూడు రోజులుగా వరద నీటిలోనే లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. మంచి నీళ్ల కోసం.. ఆహారం కోసం అలమటిస్తుంటే.. మరోవైపు మైదాన ప్రాంతాల్లో వరద బాధితుల సాయం కోసం తెచ్చిన ఆహార పొట్లాలు ఇలా చెత్తకుప్పగా దర్శనం ఇస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని ఎందుకు కోసం తెచ్చారు.. తెచ్చినోళ్లు ఎందుకు ఇవ్వకుండా అలా రోడ్లపై పడేసి వెళ్లారు అనేది తెలియటం లేదు. 

ALSO READ : నీట మునిగిన విజయ డెయిరీ.. విజయవాడలో పాల కొరత

ముంపు ప్రాంతాల్లోకి వెళ్లటానికి సరైన మార్గం లేదు.. అరకొరగానే బోట్లు వెళుతున్నాయి. దీంతో ఆహారం తెచ్చిన వారు.. వాటిని లోపలికి వెళ్లి అందించలేక అక్కడే పడేసి వెళ్లి ఉండొచ్చు అంటున్నారు స్థానికులు. ఏదిఏమైనా వరద బాధితుల సాయం కోసం తెచ్చినోళ్లు.. అవి సద్వినియోగం అయ్యే విధంగా చేసి ఉంటే మంచిది కదా..