కర్నూలు: భారీ వర్షాలకు కృష్ణా నదిలో మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు మళ్లీ తెరచుకున్నాయి. తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా నదిలో వరద కదం తొక్కి ప్రవహిస్తోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతుండడంతో.. నిన్నటి నుండి శ్రీశైలం డ్యాం గేట్లను ఒక్కొక్కటిగా తెరుస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయం శ్రీశైలం డ్యాం మొత్తం 10 గేట్లు ఎత్తేశారు. మరో రెండు మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణా నది లో వరద ప్రవాహాన్ని గమనిస్తూ… ఎగువన కర్నాటక.. మహారాష్ట్రల నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేసుకుంటూ.. వరద ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద మొత్తం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 80 వేల 290 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం 2 లక్షల 47 వేల 312 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం మెయిన్ టెయిన్ చేస్తున్నారు. కెపాసిటీ 215.807 టీఎంసీలు కాగా 215.326 టీఎంసీలు నిల్వ ఉంచుతూ.. వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం మొత్తం ఇన్ ఫ్లో:
జూరాల ప్రాజెక్టు నుండి 1 లక్ష 61 వేల క్యూసెక్కులు
సుంకేశుల డ్యాం నుండి తుంగభద్ర నది నీరు 77 వేల 170 క్యూసెక్కులు
కర్నూలు మీదుగా హంద్రీ నుండి 5 వేల 640 క్యూసెక్కులు
శ్రీశైలం డ్యాంకు చేరుతున్న మొత్తం వరద: 2 లక్షల 47 వేల 312 క్యూసెక్కులు
శ్రీశైలం మొత్తం అవుట్ ఫ్లో:
ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పతి ద్వారా 26817
10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 80 వేల 290 క్యూసెక్కులు
హంద్రీ నీవాకు 1688 క్యూసెక్కులు
పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు
మొత్తం అవుట్ ఫ్లో: 3 లక్షల 15 వేల 795 క్యూసెక్కులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువన ఉన్న నాగార్జునసాగర్.. ప్రకాశం బ్యారేజీలకు విడుదల చేస్తున్నారు.