తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జాతీయ రహదారులు వరద దిగ్బంధంలో చిక్కుకున్నాయి . హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామంలో నేషనల్ హైవేపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. గంట గంటకూ మున్నేరు వరద పెరుగుతుండంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 20ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వరదలకు రోడ్డు కొట్డుకు పోవడంతో రెండు రోజుల పాటు రాకపోకలు స్థంభించాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అని జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడే కాకుండా విజయవాడ, హైదరాబాద్ రహదారిపైకి భారీగా వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్థంభిస్తున్నాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
జాతీయ రహదారిపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య బస్సు సర్వీసులు చాలా వరకు రద్దు చేశారు. ప్రయాణం చేయదలుచుకున్న వారంతా సొంత వాహనాలలోనో , ఇతర రవాణా సాధనాల ద్వారానో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే హైదరాబాద్ గుంటూరు హైవేపై కూడా వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
జాతీయ రహదారిపై విపరీతంగా నీరు రావడంతో వాహనాలు నిదానంగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది జాతీయ రహదారిలో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు బోల్తాపడ్డాయి. రహదారుల వెంట చెట్లు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీస్తుండటంతో అధికారులు, విపత్తు నివారణా సిబ్బంది రంగంలోకి దిగారు. జాతీయ రహదారుల మీద విరిగిపడుతున్న చెట్లను తొలగిస్తూ వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తున్నారు .
వర్షాలు , వరదల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అత్యవసరమైతే మినహాయించి ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు . కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.