గద్వాల, వెలుగు : కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ వరద స్టార్ట్ అయ్యింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లతోపాటు కృష్ణా ఉపనది అయిన భీమా నుంచి కూడా వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు దగ్గర గురువారం 8 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డాం దగ్గర 32.98 టీఎంసీలు నిలువ ఉంచుకొని 25 గేట్లను ఓపెన్ చేసి 80,240 క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు.
నారాయణపూర్ డాం కు 75 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉన్నది. కృష్ణా నదికి ఉపనది అయిన మహారాష్ట్రలోని భీమా నది పై ఉన్న సన్నతి బ్యారేజీ నుండి కూడా 42,000 క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తున్నది. జూరాల ప్రాజెక్టు దగ్గర 5.123 టీఎంసీల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని 8 గేట్లను ఓపెన్ చేసి 93,611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 97 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది.