గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ఏడాది రెండోసారి బుధవారం ఉదయం 50, సాయంత్రం 50.60 అడుగులకు వరద చేరుకుంది. గత నెలలో గరిష్ఠంగా 71.3 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎగువ నుంచి వస్తున్న వరదతో నెమ్మదిగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 12,91,256 క్యూసెక్కుల మేర వరద దిగువకు వెళ్తోంది. మహారాష్ట్ర వరద కూడా మరో రెండు రోజుల్లో గోదావరికి చేరుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల మండలాలను అలర్ట్ చేశారు. కాగా వరద వల్ల ఆంధ్రా, చత్తీస్​గఢ్​ సరిహద్దులు మూతపడ్డాయి.

భద్రాచలం నుంచి చింతూరు(ఆంధ్రా), కుంట(చత్తీస్​గఢ్​)లకు వెళ్లే మార్గంలో నెల్లిపాక, రాయనపేట వద్ద గోదావరి రోడ్డెక్కింది. భద్రాచలం-పేరూరు మార్గంలో దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద వరద రోడ్డును ముంచేసింది. దీంతో ఈ మార్గాల్లో బస్సు సర్వీసులు రద్దు చేశారు. రవాణా స్తంభించిపోయింది. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోని కొత్తపల్లి, లింగాపూర్​, వీరాపురం, కందుకూరు, చింతిరేల, సున్నంబట్టి, కాశీనగరం, మంగువాయిబాడువ, ఉంజుపల్లి తదితర గ్రామాల్లోకి వరద వచ్చే అవకాశం ఉండడంతో స్పెషల్​ ఆఫీసర్లను అలర్ట్ చేశారు. అవసరమైతే ఏ క్షణాన్నైనా వీరిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కంట్రీ బోట్లు, లాంచీలు సిద్ధం చేశారు.55 అడుగుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలంటూ సెక్టోరియల్​ ఆఫీసర్లకు సూచించారు.