వరదల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టని మున్సిపల్ ఆఫీసర్లు
చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతున్న కాలనీలు
నాలుగేండ్లుగా వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
మూడేండ్లుగా కాగితాలకే పరిమితమైన ప్రపోజల్స్
రాజన్న సిరిసిల్ల, వెలుగు :
వర్షాకాలం వచ్చిందంటేనే సిరిసిల్ల ప్రజలు వరద భయంతో వణికిపోతున్నారు. పట్టణాన్ని ప్రతి ఏడాది వరదలు ముంచెత్తుతున్నా సమస్య పరిష్కారానికి సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనిచేసిన టైంలో తయారు చేసి ప్రపోజల్స్ కాగితాలకే పరిమితం అయ్యాయి. దీంతో చిన్నపాటి వర్షానికే పట్టణం జలమయం అవుతోంది. ఇప్పటికే చేపట్టిన కొన్ని పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఈ సారికూడా ముంపు ఇబ్బంది తప్పేలా లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నీట మునుగుతున్న 10 వార్డులు
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఇందులో పది వార్డులు ప్రతి ఏటా ముంపునకు గురువుతున్నాయి. సమీపంలోని కొత్త చెరువు మత్తడి దుంకినప్పుడుల్లా శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్‌నగర్, శాంతినగర్ కాలనీలు నీట మునుగుతున్నాయి. పద్మనగర్, అనంతనగర్ మధ్య 2017లో అప్పటి మున్సిపల్ ఆఫీసర్లు రూ. 3 కోట్లతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు. అయితే నిర్మాణలోపం కారణంగా కాలనీలన్నీ నీటమునుగుతున్నాయి. ఇక్కడి మురుగు నీరంతా అనంత్ నగర్, సర్దార్‌నగర్, సంజీవయ్యనగర్, వెంకంపేట, రాజీవ్ నగర్, ముష్టిపల్లి, పాత బస్టాండ్ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పట్టణంలోని పది వార్డులుపూర్తిగా నీట మునిగిపోతున్నా మున్సిపల్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేరవేరని కేటీఆర్ హామీ
2021సెప్టెంబర్‌లో భారీ వర్షాలు వచ్చినప్పుడు సిరిసిల్లలోని పలు కాలనీలు నీటమునిగాయి. సిరిసిల్ల పట్టణానికి పైన ఉన్న సుమారు 20 చెరువులు పొంగిపొర్లడం, చిన్నబోనాల చెరువు తెగిపోవడంతో ఆ చెరువు కింద ఉన్న పంటపొలాలతో పాటు సిరిసిల్ల పట్టణంలోని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో సిరిసిల్ల ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా వెనుకాడకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణంలో వరద సమస్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో సిరిసిల్లకు వచ్చే వరదను, కొత్త చెరువు నీటిని మిడ్ మానేరులోకి మళ్లించేందుకు రూ. 280 కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ మూడేండ్లు మంత్రిగా పనిచేసినా సిరిసిల్లకు ఇచ్చిన హామీని మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆఫీసర్లు రెడీ చేసిన ప్రపోజల్స్ కాగితాలకే పరిమితమయ్యాయి.
ఆగిన పనులు
సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలోని ప్రధాన డ్రైనేజీ కాల్వను ఆధునికీకరించేందుకు రూ.6.21 కోట్లతో గతేడాది పనులు ప్రారంభించారు. పనులు చేపట్టిన స్థానిక కాంట్రాక్టర్ కొంత వరకు చేసి ఆ తర్వాత ఆపేశారు. దీంతో ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు థర్డ్ పార్టీ టెండర్లు పిలిచి హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్ సైతం పనులను మధ్యలోనే ఆపేశారు. ఇంకా 100 మీటర్ల కాల్వ పని, మరో రెండు కల్వర్టుల పనులు మిగిలిపోయాయి. కొత్త చెరువు నుంచి వచ్చే వరదను మిడ్ మానేరులోకి మళ్లించేందుకు శ్రీనగర్‌కాలనీలో 2023 అక్టోబర్‌లో రూ. 15 కోట్లతో అండర్ డ్రైనేజీ పనులు మొదలెట్టారు. ఈ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. వరద ముప్పు తప్పించేందుకు చేపట్టిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ఈ సారి కూడా ముంపు బాధ తప్పేలా లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వరద రాకుండా చర్యలు తీసుకుంటాం
సిరిసిల్ల పట్టణంలోకి వరదలు రాకుండా నివారించేందుకు పలు పనులు చేపట్టాం. కానీ కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. మళ్లీ కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. వెంకంపేట, శ్రీనగర్ కాలనీల్లో చేపట్టిన కాల్వ పనులను స్పీడప్ చేస్తాం. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నాం.
- జిందం కళ, మున్సిపల్ చైర్‌పర్సన్