ఏం మారలె ఎప్పటి లెక్కనే.!

ఏం మారలె ఎప్పటి లెక్కనే.!

వానొస్తే సిటీకి ముంపు ముప్పు
వాటర్ లాగింగ్​లు.. ట్రాఫిక్ జామ్​లు
కాలనీలు, బస్తీలకు వరద బాధలు 
మెయిన్ నుంచి గల్లీ రోడ్ల దాకా కష్టాలే 
మహానగరంపై పట్టింపులేని బల్దియా 
శాశ్వత పరిష్కారం చూపని అధికారులు
హైదరాబాద్, వెలుగు:
వరద..ట్రాఫిక్ జామ్​లు, రోడ్లు కరాబ్.. వానొస్తే సిటీ పరిస్థితి ఇంతేనా..! సిటిజన్లు వాన బాధలు  ఎదుర్కోవాల్సిందేనా.! విశ్వనగరం అయ్యేదెప్పుడోగానీ..! వర్షాలు పడితే మహానగరంలోని పలు ఏరియాలు జలమయం కావాల్సిందేనా.! ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ముంపు ముప్పును ఎదుర్కొక తప్పడం లేదు.  ప్రతిసారి అవే కాలనీలు, బస్తీలు నీళ్లలో మునుగుతుంటాయి. హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​తో పాటు కాలనీలు, బస్తీల దాకా జనాలు వరద కష్టాలు భరించక తప్పని పరిస్థితి నెలకొంది. వానొస్తుందంటే ఇండ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు పరుగులు తీసే దుస్థితి ఉంది. మెయిన్ రోడ్ల నుంచి గల్లీ రోడ్ల దాకా మోకాలి లోతు కంటే ఎక్కు వగా వరద నిలుస్తోంది. ఇక హైటెక్​సిటీ, ఎల్​బీనగర్, ఖైరతాబాద్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్,  బేగంపేట, మూసాపేట, కూకట్​పల్లి, లింగంపల్లి, చార్మినార్, నాంపల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైతుంది. రోడ్డుపై ఎక్కడో ఒక చోట వరద నీరు నిలుస్తుండగా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇలా ఏళ్లుగా ప్రాబ్లమ్స్​ ఎదురవుతుంటే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని మాత్రం వీడడంలేదు. వరద సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. 

ఈ ఏరియాల నుంచే కంప్లయింట్లు 
పంజాగుట్టలోని ఎన్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్లై ఓవర్, లేక్‌‌వ్యూ గెస్ట్‌‌ హౌస్ రాజ్‌‌భవన్‌‌ రోడ్‌‌, ధరమ్ కరమ్ రోడ్‌‌, బేగంపేట్‌‌లోని యాక్సిస్‌‌ బ్యాంక్‌‌, కర్బాలా మైదాన్‌‌, ఆర్పీ రోడ్‌‌,  కార్ఖానా రోడ్‌‌, కేఎఫ్‌‌సీ,ఆర్పీ రోడ్‌‌ చిత్ర దుర్గ, సైఫాబాద్‌‌లోని షాదన్ కాలేజ్‌‌, అయోధ్య జంక్షన్‌‌, నాంపల్లిలోని పోలీస్‌‌ కంట్రోల్‌‌ రూమ్ జంక్షన్‌‌, సికింద్రాబాద్‌‌  రైల్ నిలయం జంక్షన్,    పెన్షన్‌‌ ఆఫీస్‌‌ సిగ్నల్, జూబ్లీహిల్స్‌‌ రోడ్ నం. 36  క్రోమా స్టోర్ తదితర ప్రాంతాల్లో మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారు. వానలు పడితే చాలు ప్రతిసారి బల్దియాకు వెళ్లే కంప్లయింట్లలో సగానికిపైగా వాటర్ లాగింగ్ పాయింట్లవే.   వరదనీరు నిలవకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలను బల్దియా చేపట్టలేకపోతోంది. దీంతో ప్రతి వానాకాలం ఇదే పరిస్థితి ఉంటోంది. 

ALSO READ :అరికెపూడిపై ఎన్​హెచ్ఆర్సీ కేసు

నాలుగేళ్లుగా ఇంతే.. 
టోలీచౌకి​లోని నదీంకాలనీ, నాగోల్​లోని అయ్యప్ప కాలనీ, సరూర్​నగర్​లోని సీసల బస్తీ, గాజులరామారంలోని వోక్షిత్ కాలనీ, బేగంపేటలోని మయూరి మార్గ్, నానల్ నగర్, ఖైరతాబాద్​లోని ​పీజేఆర్​ బస్తీ , ఎంఎస్​ మక్తా, జాంబాగ్​లోని గణేశ్​టెంపుల్, దేవీనగర్,చుడిబజార్​, బండ్లగూడ అలీనగర్, శంకర్ నగర్, రసూల్​పురా, యాకుత్ పురా, ముసారాం
బాగ్​తో పాటు ఉప్పల్, నాచారం, రామంతా పూర్​లోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ఇండ్లు అపార్టుమెంట్లలోని సెల్లార్లలోకి వరదనీరు చేరుతుంటుంది. రోజుల తరబడి ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిచోట్ల రెండు మూడు రోజుల పాటు మోటార్ల ద్వారా వరదనీటిని తొలగిస్తుంటారు. ఇట్లా 2020 వరదల నుంచి వరుసగా ప్రతిఏటా ఇదే పరిస్థితి రిపీట్​ అవుతుంది.  


ఖాళీ చేయాల్సిందే.. 
వానపడితే చాలు.. కింది ఫ్లోర్లు మొత్తం ఖాళీ కావాల్సిందే. 10 ఏండ్లకు పైగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. పెద్ద వాన పడితే కాలనీలో నడుం లోతు నీరు నిలుస్తుంది.  దీంతో కాలనీలో అద్దెకు ఉండేందుకు కూడా ఎవరు రావడం లేదు- అర్జున్, మయూరి మార్గ్, బేగంపేట


వానొస్తుందంటే పరుగులే..
వాన పడుతుందంటే వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తుంటాం. నాలుగేండ్లుగా సమస్య ఉన్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. గతేడాది వరదలప్పుడు వారం రోజులు ఇండ్లను వదిలి వెళ్లిపోయాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. వాన పడుతుందంటే రాత్రి నిద్ర కూడా పట్టదు.  - శంకర్, అయ్యప్ప కాలనీ, నాగోల్